YS-Jagan -అవకాశం కోసం ఎదురు చూడడమే రాజకీయ నాయకులకుండాల్సిన ప్రధాన లక్షణం. సహనంతో వేచిచూస్తే 20 ఏళ్ళకైనా సీఎం సీటు కూడా తనను వెతుక్కుంటూ వస్తుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారు నిరూపించారు. కానీ వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా, తన పౌరుష పదజాలం మరియు సినీ డైలాగ్ లతో ఎదుటివారికి అవకాశాలు కల్పిస్తుంటారు. జగన్ ఉద్వేగంతో మాట్లాడిన ‘టంగ్ స్లిప్’ వ్యాఖ్యలను తాజాగా ‘జనసేన’ అధినేత క్యాష్ చేసుకున్నారు.

“గురి చూసి కొట్టడం” అంటే ఇదే అన్న చందంగా… కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి నేను రెడీ, మద్దతు ఇవ్వడానికి మీరు రెడీనా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన సవాల్ ను స్వీకరిస్తూ… “మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉండండి… చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టండి, నేను కూడా ఢిల్లీ సెంటర్ కు వస్తాను, మీకు మద్దతు తెలుపుతాను. అంతేకాదు తన వంతు కృషిగా ఇతర పార్టీలతో చర్చలు జరిపి, ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేటంత మెజారిటీని కూడగట్టే ప్రయత్నం చేస్తాను” అంటూ కుండబద్దలు కొడుతూ చెప్పారు పవన్ కళ్యాణ్.

అవకాశం వచ్చిన చోట మరింత తెలివిగా వ్యవహరిస్తూ… ఈ అవిశ్వాసానికి టిడిపి కూడా మద్దతు తెలిపేలా చర్చలు జరుపుతాను, ఒకవేళ వారు తెలపలేదంటే వారి బండారం కూడా బయట పడుతుంది… మీరు చెప్పారు కాబట్టి, చొరవ తీసుకుని ముందుగా మీరు మార్చి 3వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి… అంటూ పరిపక్వత కలిగిన నాలుగు మాటలు చెప్తూ… తన మీద విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తగ్గితే కేంద్రానికి భయపడ్డారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఇరుకున పెట్టారు.

దీంతో ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి “ముందు నూయ్యి, వెనుక గొయ్యి” మాదిరిలా తయారయ్యింది. ఒకవేళ అన్న మాటకు కట్టుబడి బిజెపిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, జగన్ పై ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతాయంటూ పొలిటికల్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యల పర్యవసానాలే తాజాగా ఈడీ ఇచ్చిన సమన్లుగా ఇప్పటికే రాజకీయ వర్గాలు హంగామా చేస్తున్నాయి. ఒకవేళ ముందడుగు వేసి నిజంగా అవిశ్వాసం ప్రవేశపెడితే… భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

అలా అని ప్రస్తుత పరిస్థితులలో వెనుకడుగు వేశారంటే… దానిని ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, టిడిపి కూడా క్యాష్ చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ అవిశ్వాసం ప్రవేశపెడితే, దానికి దక్కే క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి… తనకేమీ అభ్యంతరం లేదని పవన్ స్పష్టంగా చెప్పిన దరిమిలా, వెనుకడుగు వేసారంటే, ప్రజల్లో జగన్ డీలా పడ్డట్లే! ఏదో ప్రజలను ఉద్వేగభరితులను చేసి తద్వారా నాలుగు ఓట్లు రాబట్టాలని జగన్ వేసిన బాణాలు, ‘బూమ్ రంగ్’ కావడం విశేషం.