YS Jagan Clarity on Amaravatiఒక వైపు ప్రజలకు కనీవినీ ఎరుగని స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క ప్రజల పై పన్నుల భారం మోపి ఆ ఇచ్చిన డబ్బు ఇంకో చేత్తో లాగేసుకుంటుంది. రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే సాకుతో పెట్రోలు, డీజిల్‌పై రూపాయి చొప్పున సెస్‌ విధించాలని నిర్ణయించింది.

పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్ విధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై వ్యాట్ 31% + 5 రూపాయిలు… డీజల్ పై 22.5%+ 5 రూపాయిలు భారం ప్రభుత్వం వాహనదారుల మీద మోపుతోంది. ఈ సెస్ ద్వారా ప్రభుత్వానికి 600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆ నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తాం అంటూ ప్రకటించడం విశేషం. రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కు ఈ నిధులను కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఖజానాలో ఉన్న డబ్బు మొత్తం జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు కూడా సరిపోకపోవడంతో అప్పులతోనే కాలం వెల్లదీస్తుంది ప్రభుత్వం.

తాజాగా అప్పులు కూడా దొరికే పరిస్థితి కనిపించకపోవడంతో ఇక ప్రజల మీద బాదుడుకు సిద్ధం అయ్యింది. “ఈ ఆదాయం వచ్చాకా కూడా ప్రభుత్వం దానిని రోడ్లను బాగు చెయ్యడానికి ఉపయోగిస్తుంది అనేమీ లేదు. ఆ పేరిట ఈ పేరిట మళ్ళీ పందేరానికి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు,” అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.