Old Notes Bank Depositsపెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో బ్యాంకు ఖాతాల్లో రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల‌ క‌న్నా ఎక్కువ‌గా న‌గ‌దు డిపాజిట్ చేసిన వారికి ఆదాయ‌ ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేస్తూ ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో చెప్ప‌మ‌ని అడుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే సీనియర్‌ సిటిజన్‌లకు తాజాగా ఆ నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. 70 ఏళ్లు పైబడిన వారు చేసిన 5 లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి పరిశీలన చేపట్టబోమని తెలిపింది.

ఇదే సమయంలో మిగ‌తా వ్య‌క్తులపై మాత్రం విచార‌ణ కొన‌సాగుతుంద‌ని చెప్పింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే 70 ఏళ్ల లోపు వ్యక్తులు 2.5 నుంచి 5 లక్షల వరకు చేసిన డిపాజిట్లపై ఐటీ శాఖ‌ వెబ్‌ సైట్ లో వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని తెలిపింది. వారిని కూడా ఇబ్బందులు పెట్టే ప్ర‌శ్న‌లు అడ‌గ‌బోమని, వారికి అక్కడితోనే వెరిఫికేషన్ పూర్తవుతుందని తెలిపింది. అయితే, త‌మ‌కు అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రం విచారణ జ‌రుపుతామ‌ని తెలిపింది.