china-most-expensive-divorceఅత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ల నిర్మాణంతో రికార్డులు సృష్టించిన చైనాలో… అత్యంత ఖ‌రీదైన విడాకుల సంఘ‌ట‌న కూడా చోటు చేసుకుంది. సాధారణంగా భార్య, భ‌ర్తలు విడాకులు తీసుకునే స‌మ‌యంలో భ‌ర్త‌ నుంచి భార్య‌కు ఎంతో కొంత భ‌రణంగా ఇస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మొత్తం ఆస్తిలో స‌గ‌భాగాన్ని ఇస్తుంటారు. అయితే, ఆస్తిలో స‌గ‌భాగాన్ని ఇచ్చే సంఘ‌ట‌న‌లు చాలా అరుదుగా క‌నిపిస్తాయి. అలాంటి అరుదైన ఘటనే ఈ సరికొత్త విడాకుల రికార్డుకు కారణమైంది.

వీడియో గేమ్‌లను తయారు చేసే ప్ర‌ముఖ సంస్థ‌ ‘బీజింగ్‌ కున్‌ లున్‌ టెక్‌’ కంపెనీ చైర్మన్, సీఈవో 39 ఏళ్ళ ఝౌ యుహి త‌న భార్య‌ నుంచి విడాకులు తీసుకుంటున్న‌ సంద‌ర్భంగా స‌గ‌భాగాన్ని త‌న భార్య‌కు చెల్లించాల్సి వస్తోంది. 38 ఏళ్ళ త‌న భార్య ‘లీ’తో విడిపోవాలని నిర్ణ‌యం తీసుకున్న ఝౌ యుహి త‌మ ఆస్తుల నుంచి 8,470 కోట్ల రూపాయలు ఇవ్వ‌నున్నారు. భార్యాభ‌ర్త‌లిరువురి పేర‌టి మొత్తం 26,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, 17 వేల కోట్ల రూపాయలను ఇద్ద‌రూ పంచుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఇరువురికీ 8,470 కోట్ల రూపాయలు వస్తాయని స‌ద‌రు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

త‌మ దేశంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇవేనని స్థానిక వార్తాపత్రిక‌లు పేర్కొన్నాయి. విడాకుల అంశంలో గ‌తంలో ఆ దేశంలో ఒక‌ వ్యాపారి తన రష్యా భార్యకు 7,400 కోట్లు చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. వారి పేరిటే ఇప్ప‌టివ‌ర‌కు ఖరీదైన విడాకుల రికార్డు ఉంది. తాజాగా యుహి జంట బ్రేక్ అధిగ‌మించ‌నుంది. ఆ దేశంలో విడాకుల కేసులు భారీగా పెరిగిపోయాయి. 2000లో 12 లక్షల జంట‌లు విడాకులు తీసుకోగా, 2009లో 25 లక్షల జంట‌లు తీసుకోగా, ఇక 2015లో ఏకంగా 38 లక్షల జంట‌లు విడాకులు తీసుకున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.