YV Subba Reddy- TTD Chairmanతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు యధాతదంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటివరకు స్వామివారి ఆలయంలో 200 మంది వరకూ కరోనా సోకింది. నిన్న తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు కరోనా కారణంగా మృతి చెందారు. అలాగే పెద్ద జీయర్ వారు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనితో దర్శనాలు వెంటనే ఆపాలి అని డిమాండ్లు వస్తున్న బోర్డు మాత్రం ససేమిరా అంటుంది. భక్తుల వల్ల కరోనా వ్యాప్తి జరగడం లేదని , ఈ మేరకు నిర్దారణకు రావడం జరిగిందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అయితే నిపుణులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు.

“తిరుమలకు వచ్చే భక్తులు కొండ పైన ఒక రోజుకు మించి ఉండనివ్వడం లేదు. వారికి కరోనా సోకినా లక్షణాలు బయటపడేలోపు వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ప్రకారం భక్తులకు కరోనా సోకుతుందా లేదా అనేది చెప్పడం కష్టమే,” అంటున్నారు నిపుణులు. కేవలం దేవాలయం ఆదాయం పడిపోకూడదని ఇటువంటి సమయంలో భక్తులు, స్టాఫ్, అర్చకుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

గతంలో లాక్ డౌన్ సమయంలో దాదాపుగా మూడు నెలల పాటు తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. ఆ సమయంలో అర్చకులే స్వామివారికి ఏకాంతంలోనే అన్ని సేవలూ నిర్వహించారు. ఇప్పుడు కూడా కరోనా ఉదృతి తగ్గే వరకు అదే పద్దతి అవలంభించాలని చాలా మంది కోరుతున్నారు.