Yuvraj-singh-six-sixers-storyదక్షిణాఫ్రికా వేదికగా జరిగిన పొట్టి క్రికెట్ టీ20 ఫార్మాట్ లో తొలి వరల్డ్ కప్ టైటిల్ ను ధోని నాయకత్వంలో టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన వీరవిహారం, సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్నటికి మరిచిపోలేడు. ముఖ్యంగా డర్బన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యువీ, ఒకే ఓవర్ లో వరుసగా ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచి కొత్త చరిత్ర సృష్టించాడు.

యువీ బాదుడుతో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తో, టీం కూడా మానసికంగా కృంగిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి బ్రాడ్ కు కొన్ని రోజుల సమయం పట్టింది. అయితే ఆ మ్యాచ్ లో యువీ అంతగా రెచ్చిపోవడానికి కారణం… ఇంగ్లండ్ జట్టు సభ్యులు స్లెడ్జింగ్ కు దిగడమే. ముఖ్యంగా ఆండ్రూ ప్లింటాఫ్ – యువీల మధ్య మాటల యుద్ధంలో ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, అసభ్యకరమైన పదాలు వాడడం, ఈ వివాదంతో రెచ్చిపోయిన యువీ బ్రాడ్ బౌలింగ్ ను తుత్తునియలు చేయడం అంతా బుల్లితెరపై అందరూ వీక్షించినవే. అయితే అసలు యువీ – ఫ్లింటాఫ్ ల మధ్య ఏం జరిగిందో స్వయంగా యువరాజ్ సింగే వివరించారు. ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తే…

‘నీ షాట్లు హాస్యాస్పదంగా ఉంటాయని ఫ్లింటాఫ్‌ అన్నాడు. ఎందుకంటే అంతకుముందు అతని బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టా. దీంతో నేనూ ఘాటుగా బదులిచ్చా. ఏం మాట్లాడుతున్నావని ఫ్లింటాఫ్‌ ప్రశ్నించాడు. నేనేం అన్నానో నువ్వు విన్నావని చెప్పా. దాంతో నీ గొంతు కోసేస్తా అంటూ అతను హెచ్చరించాడు. నా చేతిలో ఉన్న బ్యాట్‌ చూశావుగా. దాంతో నిన్ను ఎక్కడ కొడతానో తెలుసుగా? అని అతనికి బదులిచ్చా’ అని యువీ పేర్కొన్నాడు. ఈ గొడవతో తనలో ఆవేశం కట్టలు తెంచుకుందని, బ్రాడ్ బౌలింగ్ ను చితకబాదానని యువీ చెప్పాడు.

ఆ ఘటన నాకు మంచే చేసింది. నేను చాలా ఆవేశానికి గురయ్యా. ప్రతీ బంతిని స్టేడియం అవతలకు బాదాలనుకున్నా. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు మనకు మంచి చేస్తాయి. ఒక్కోసారి ప్రతికూలంగా మారుతాయి. కానీ, ఆ రోజు మాత్రం అది ప్రత్యర్థులను దెబ్బతీసిందని అనుకుంటున్నాను అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఓ టీవీ షో సందర్భంగా ఈ ఉదంతం మొత్తాన్ని యువరాజ్ బహిర్గతం చేశాడు. అయితే ఆ సంభాషణలో ఇద్దరూ వాడిన ‘సెన్సార్డ్’ పదాలను మాత్రం యువీ రివీల్ చేయడానికి ఇష్టపడలేదు.