yuvaraj Singh 300 Matchమృత్యువు వరకు వెళ్ళొచ్చిన వ్యక్తి జీవితంలో ఇంకా చూడాల్సింది ఏముంటుంది? తీరని కోరికలు ఏమున్నాయి? అన్న ప్రశ్నలు వేస్తే… ఒక్కొక్కరి నుండి ఒక్కో సమాధానం వ్యక్తమవడం సహజమే. కానీ… యువరాజ్ సింగ్ నోట నుండి వచ్చిన సమాధానం మాత్రం మనసున్న ప్రతి వారిని కదిలింపజేస్తుంది. అలాగని గొప్ప గొప్ప సందేశాలు… సంస్కృత పదాలేమీ చెప్పలేదు. అందరికీ అర్ధమయ్యే విధంగా, స్పష్టంగా, చక్కగా చెప్పిన యువీ వ్యాఖ్యలకు అంతా ‘సలాం’ కొడుతున్నారు.

తాను ఇప్పటివరకు జీవించి ఉండడమే ఎక్కువ, అన్నింటి కన్నా గొప్ప విషయం అదే… దానిని మించింది లేదు… అలాంటపుడు తీరని కోరికలు అనేవి తన దృష్టిలో చాలా చిన్న విషయాలుగా అభివర్ణించాడు యువరాజ్. గడిచిపోయిన విషయాల గురించి పెద్దగా ఆలోచించనని చెప్పిన యువీ, జట్టులో స్థానం సంపాదించడం కంటే నిలబెట్టుకోవడం ముఖ్యమని, ప్రస్తుతం తన ఆటతీరుతో సంతోషంగా ఉన్నానని, కెరీర్ లో ఉన్నత స్థితిలో ఉన్నానని… ఇది నాకు చాలని అభిప్రాయపడ్డాడు.

నిజమే… యువీ జీవితాన్ని తలచుకుంటూ ఈ వ్యాఖ్యలు వింటుంటే… హృదయం చలించడం సహజం. ఓ పక్కన కాన్సర్ తో బాధపడుతూ జట్టును వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేర్చిన ఆటగాళ్ళల్లో యువీ ప్రధముడు. అలాంటి యువరాజ్ కు జట్టులో స్థానం ఇచ్చి, టీమిండియా సముచితమైన గౌరవాన్నే ఇస్తోంది. దానికి తగ్గట్లుగా… జట్టు ఆపదలో ఉందంటే… యువరాజ్ ఖచ్చితంగా ఆదుకుంటాడు క్రికెట్ అభిమానుల అపారమైన విశ్వాసం. అలాంటి యువరాజ్ నేటి సెమీ ఫైనల్ తో కెరీర్ లో 300వ మ్యాచ్ ఆడబోతున్నాడు.

మరపురాని ఈ మనిషికి మధురానుభూతులను మిగిల్చే మ్యాచ్ గా మిగిలిపోతుందని ఆశిద్దాం.