Yuva_Galam_Nara_lokesh_600_KMSటిడిపి యువనేత నారా లోకేష్‌ జనవరి 27వ తేదీన కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. మూడు నెలలు పూర్తికాక మునుపే 600 కిమీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ మూడు నెలల పాదయాత్రకే వైసీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఓడిపోయింది. అదీ ఏదో స్వల్ప తేడాతో కాదు… వేలఓట్ల తేడాతో ఓడిపోయింది. కర్నూలు న్యాయరాజధాని, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగలంటూ వైసీపీ నేతల మాయమాటలను ప్రజలు నమ్మి ఉండి ఉంటే దానికే పట్టం కట్టేవారు కానీ వైసీపీని కాదని టిడిపికి పట్టం కట్టారు. కనుక ఇది స్పష్టమైన ప్రజాతీర్పు… చాలా స్పష్టమైన ఓటమి అని భావించవచ్చు. నారా లోకేష్‌ మూడు నెలల్లో 600 కిమీ పాదయాత్ర చేస్తేనే వైసీపీ మూడు సీట్లు కోల్పోతే ఆయన మరో ఏడాదిపాటు శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేస్తే వైసీపీ పరిస్థితి ఏమవుతుందో?అనే సందేహం కలుగకమానదు.

నారా లోకేష్‌ ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గంలోని చిన్నయల్లంపల్లి వద్ద 600 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ ఏర్పాటు చేస్తానంటూ శిలాఫలకం మీద వ్రాయించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ చేనేత కార్మికులతో సమావేశమైనప్పుడు వారు తమ గోడు చెప్పుకొన్నారు. మండలంలో 2,000 కుటుంబాలు పూర్తిగా చేనేతపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థుల కోసం తాము బట్టలు నేసి ప్రభుత్వానికి ఇచ్చామని, నేటికీ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం సహకార సంఘాలకు రూ.80 కోట్లు బకాయి ఉందని, తాము అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీపీఎఫ్ ఖాతాలలో దాచుకొన్న సొమ్మును తీసి వాడుకొందని అందరికీ తెలుసు. కానీ నిరుపేదలైన చేనేత కార్మికులకు రూ.80 కోట్లు బకాయిపడిందనే విషయం నారా లోకేష్‌ పాదయాత్రతో లోకానికి తెలిసింది. వారు అప్పులు చేసి నేసి ఇచ్చిన బట్టలను తీసుకొని ప్రభుత్వం వెంటనే వారికి డబ్బు చెల్లించకపోవడాన్ని ఏమనుకోవాలి?

నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రలో ఒక ప్రభుత్వం వైఫల్యం చెందితే ప్రజలు ఏవిదంగా బాధలు పడతారో కళ్ళారా చూస్తున్నారు. వింటున్నారు. వైసీపీ నేతలు ప్రజాధనాన్ని ఏవిదంగా దోచుకొంటున్నారో ప్రజలే చెపుతున్నారు. వైసీపీ పాలనతో ప్రజలు ఎంతగా వేసారిపోయి ఉన్నారో కళ్ళారా చూస్తున్నారు. వారి కష్టాలను తీర్చుతానని మాట ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ, తన కోసం వేచి చూస్తున్న ప్రజల కోసం ముందుకు సాగుతున్నారు. ఈ యువగళం పాదయాత్ర అనుభవం వ్యక్తిగతంగా నారా లోకేష్‌కి, పార్టీ పరంగా టిడిపికి, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందనే ఆశిద్దాం.