విజయవాడ పరిధిలోని పెనమలూరు వైసీపీలో కుమ్ములాటలు ఇళ్లమీద దాడులు, రాజీనామాల వరకు వెళ్ళాయి. ఉయ్యూరు మండలంలోని కాటూరుకి చెందిన యలమంచిలి పూర్ణిమ, ఆమె భర్త కోటయ్య చౌదరి ఇద్దరూ వైసీపీ నాయకులు. పూర్ణిమ ఉయ్యూరు జెడ్పీటీసీ సభ్యురాలు కూడా.
కొంతకాలం క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో పూర్ణిమ దగ్గర బంధువు సజ్జా అనూష కాటూరు-2 సెగ్మెంట్ నుంచి టిడిపి మద్దతుతో పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే పార్ధసారధి, అనుచరులు కొలుసు పోతురాజు తదితరులు పూర్ణిమ కుటుంబంపై కక్ష గట్టి వేధిస్తున్నారు. వారిరువురూ టిడిపితో కుమ్మక్కు అయ్యి తమ బంధువును గెలిపించారని ఆరోపిస్తున్నారు. అయితే ఆమెకు తాము ఎటువంటి సహాయసహకారాలు అందించలేదని పూర్ణిమ, కోటయ్య చౌదరీ దంపతులు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వేధిస్తూనే ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కె.పార్ధసారధి అనుచరులు పూర్ణిమ ఇంటిపై దాడి చేసి బెదిరించడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసేశారు.
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే అనుచరులు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్లను, వ్యాపారస్తులను బెదిరిస్తూ మామూళ్ళు వసూలు చేస్తున్నారని పిర్యాదులు వినిపిస్తున్నాయి. లేఅవుట్ వేస్తే ఎకరానికి రూ.5 లక్షలు, అపార్టుమెంట్ కడుతునట్లయితే ఒక్కో ఫ్లాటుకి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు రియాల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సొంత పార్టీ నేతల ఇంటిపైనే దాడి చేసి రాజీనామా చేయించినప్పుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను విడిచిపెడతారా?