YSRCP YS Jagan immature Politics ప్రతిపక్ష నేత జగన్ చేస్తోన్న వ్యూహాత్మక తప్పిదాలు రాజకీయ పరంగా వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. అవసరానికి తగినట్టు వ్యవహరించాల్సిన జగన్ పదే పదే ఒకే రకమైన తప్పులు చేస్తుండడం పార్టీ నేతలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. జగన్ వైఖరితో ప్రజల్లో తమ పార్టీ మరింత చులకన అయిపోతోందని నేతలు అంతర్లీనంగా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల జగన్ చేసిన మూడు తప్పులు ప్రధానంగా వినపడుతున్నాయి.

ఇటీవల నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వైసీపీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజల్లో చులకన భావన తెచ్చుకోవడం వెనుక జగన్ ప్రభావమే కనపడింది. ఆ ప్రమాదంలో 11 మంది చనిపోవడం, ఆ బస్సు టీడీపీ నేతలది కావడంతో ఒకానొక దశలో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన జగన్ విఫలమయ్యారు. నందిగామ వెళ్లిన జగన్ వైద్యుడి నుంచి రిపోర్ట్ లాక్కోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అక్కడితో ఆగక జైలుకు పంపుతానంటూ కలెక్టర్‌ను హెచ్చరించడంతో వ్యవహారం పక్కదారి పట్టింది, ఫలితంగా టీడీపీది పైచేయి అయ్యింది.

వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన భూమా, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అలాంటి భూమా కాలం చేసిన వేళ, జగన్ వేసిన తప్పటడుగు ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది. అసెంబ్లీలో భూమా సంతాప తీర్మానాన్ని జగన్ బాయ్‌ కాట్ చేసి సమర్థించుకోలేనంత తప్పు చేశారు. అధ్యక్షుడి నిర్ణయం పార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది. భూమా నాగిరెడ్డి గౌరవాన్ని కాపాడేందుకే బాయ్‌ కాట్ చేశామని జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

ఇక చివరగా పోలవరం ప్రాజెక్టుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నకు… జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైసీసీ వ్యవహరించిన తీరు ఎవరికీ అంతు బట్టలేదు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాలను అసెంబ్లీలో చూపిస్తానని జగన్ పేర్కొన్నారు. దీంతో స్పందించిన చంద్రబాబు ఆ మాట వాస్తవమేనని, అయితే ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పడం వల్లే ప్యాకేజీకి అంగీకరించాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

అనంతరం చంద్రబాబు ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఈ తీర్మానాన్ని ఎందుకు వ్యతిరేకించామో తెలియకుండా పోయిందని, ఈ విషయంలో తమకే స్పష్టత లేదని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. సహజంగా గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడం రాజకీయ నాయకుల ప్రధమ లక్షణం. కానీ, జగన్ అందుకు విరుద్ధంగా నానాటికి పార్టీ పతనానికి కారణమవుతుండడం పార్టీ నేతలకు రుచించడం లేదు. దీంతో చేసేదేమీ లేక ‘రాజువయా… మహారాజువయ్యా…’ అంటూ తమ ఆవేదనను గానం రూపంలో ఆలపించుకోవడం పార్టీ నేతల వంతవుతోంది.