ysrcp-ys-jagan-bjp-allianceవర్తమానం నుండి ఒక్కసారి అయిదేళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే… సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు… జగన్ జైలులో ఉన్న రోజులు. అప్పటివరకు బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరాలు పెట్టిన సీబీఐ కూడా ఒక్కసారిగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో బెయిల్ వచ్చేసింది. ఇలా ఎందుకు జరిగింది? అన్నది సగటు మానవుడికి కూడా అర్ధమయ్యే విధంగా నాడు కాంగ్రెస్ రాజకీయాలు అర్ధమయ్యాయి. కాంగ్రెస్ – జగన్ ల నడుమ కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంతో… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ను బహిరంగంగా తిట్టి, తద్వారా ప్రజల ఓట్లు కొల్లగొట్టాలనే విఫల యత్నాలను నాటి ప్రజలు చెంపపెట్టులా తిరస్కరించారు.

కట్ చేసి, వర్తమానంలోకి వస్తే… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాని మోడీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు రావచ్చు. అయిదేళ్ళ క్రితం ఏదైతే జరిగిందో… సరిగ్గా అవే సీన్లు ప్రస్తుతం రిపీట్ అవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బిజెపిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం కంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ఇంకా ఎక్కువ ద్రోహం చేస్తోంది. దీంతో బిజెపిపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు బిజెపి – జగన్ ల నడుమ లోపాయికారి ఒప్పందాలు కుదిరాయని స్పష్టమవుతోంది.

ఇప్పటికే బిజెపి – వైసీపీ నేతల నడుమ చర్చలు జరగడం, వారిద్దరూ ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారన్నది మంత్రి మాణిక్యాలరావు వంటి వారు తాజాగా చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఒక్క మంత్రేముంది… బిజెపి, వైసీపీ నేతల పోకడలను అర్ధం చేసుకున్న రాజకీయ విజ్ఞులకు ఎవరికైనా ఇట్టే అర్ధమయ్యే విషయం ఇది. బిజెపికి ఫుల్ మెజారిటీ ఉన్న రీత్యా, అవిశ్వాస తీర్మానం పెట్టినా, లేకున్నా ప్రయోజనం శూన్యం. ఎలాగూ పూర్తి మెజారిటీ ఉంది గనుక తాము సిద్ధం అంటూ ఓ ప్రకటన చేసారు. అవిశ్వాసం వలన ప్రజల్లో రాజకీయంగా లబ్ది పొందవచ్చనే భావన వైసీపీ నేతల్లో ఉండొచ్చు గానీ, ఈ ‘బిసి’ నాటి రాజకీయాలను ప్రజలు ఎప్పుడో అర్ధం చేసుకున్నారని గమనించాలి.

ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆలోచించడం, దానికి జగన్ ‘తానా తందానా’ అంటూ వంత పాడడం గత అయిదేళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇన్నాళ్ళు గడిచినా జగన్ అప్ డేట్ కాకపోవడం విస్తుపోయే అంశం. మరొక కీలక అంశం ఏమిటంటే… జగన్ ను అండగా చూసుకుని ఆంధ్రప్రదేశ్ కు తీరని దోహం చేయడం కేంద్ర ప్రభుత్వాల వంతవుతోంది. అప్పటి కాంగ్రెస్ అయినా… ఇప్పటి బిజెపి అయినా..!