YSRCP Kapu‘కాపు ఐక్యగర్జన’ పేరుతో సభను ఏర్పాటు చేసుకున్న ముద్రగడ, సభను సజావుగా ముగిసేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అయితే అలా కాకుండా ప్రజలను రెచ్చగొట్టి రైళ్ళను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడం… ఆ తర్వాత జరిగిన పర్యవసానాలు విజ్ఞులకు విదితమే. ఈ దుర్ఘటనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ముద్రగడ పద్మనాభమే కారకుడు. కొబ్బరిచెట్ల మధ్య ముగియాల్సిన సభ రైలు పట్టాల వరకు వెళ్ళడానికి ముద్రగడ చేసిన వ్యాఖ్యలే కారణం. దీంతో ఏదో కుట్ర కోణం దాగి ఉందని భావించిన పోలీసులు ముద్రగడను ఏ-1 నిందితుడిగా చేరుస్తూ బుధవారం నాడు కేసులను నమోదు చేసారు.

అయితే, ఇవన్నీ కూడా కుట్ర పూరితమైన కేసులనీ, కేవలం కాపులను అణిచి వేయడానికే ప్రయత్నిస్తున్నారని, వంగవీటి రంగాను తుదముట్టించి ఆనాడు ‘కాపునాడు’ అణిచివేయగా, ముద్రగడపై ఏకంగా 73 కేసులు మోపి, ఈనాడు ‘కాపునాడు’ను నీరు కార్చేందుకు రకరకాలుగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని జగన్ మీడియా సోషల్ వెబ్ సైట్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే సదరు మీడియా వ్యవహార తీరు పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపివేసి, హత్య రాజకీయాలు చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కాదని, తప్పు ఎవరూ చేసినా శిక్షార్హులేనని సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.