Welfare Schemes in Andhra Pradeshఆంధ్రప్రదేశ్‌లో జగనన్న పధకాలు అన్నీ ఇన్నీ కావు. టీవీ ఛానల్స్‌లో, న్యూస్ పేపర్లలో, ఆర్టీసీ బస్సులు మీద చివరికి ఊళ్లలో మరుగుదొడ్ల గోడలపైనా…ఎక్కడపడితే అక్కడే వాటి గురించి ప్రకటనలో, పోస్టర్లో కనిపిస్తూనే ఉంటాయి. కనుక ప్రజలకు అవన్నీ కంఠోపాఠాలే.

బడికి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కాలు చెప్పలేకపోవచ్చు కానీ జగనన్న పధకాల జాబితా చెప్పమంటే గడగడమని చెప్పేస్తారంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆ పధకాల గురించి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోంది.

ఇక పొరుగున తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపీ నుంచి వెళ్ళిస్థిరపడినవారున్నారు. ఎన్నికలొస్తే వారూ ఏపీకి వచ్చి ఓట్లేస్తుంటారు. కనుక వారికీ మన గొప్పదనం గురించి చెప్పుకోక తప్పదు. కనుక అక్కడా మన సంక్షేమ పధకాల గురించి న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు వేస్తుంటుంది. తెలుగు పేపర్లు చదివే అలవాటులేని వారిని మిస్ చేసుకోవడం ఇష్టం లేక వారి కోసం ప్రత్యేకంగా డెక్కన్ క్రానికల్, ది హిందూ వంటి ఇంగ్లీష్ పేపర్లలో సంక్షేమ పధకాల గురించి ఫుల్ పేజీ ప్రకటనలు వేయిస్తుంటుంది.

అయితే సదరు పధకాలకు ప్రభుత్వం కేటాయించే సొమ్ము ఒక ఎత్తైతే, ఈ టీవీ ఛానల్స్‌లో, న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం పెట్టే ఖర్చు మరో ఎత్తు. ఉదాహరణకు గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు హయాంలో విద్యార్దులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏడాదికి ఒకేసారి చెల్లించేవారు. అదీ… నేరుగా ఆయా కాలేజీల బ్యాంక్ ఖాతాలలోనే జమా చేసేవారు.

కానీ ఇప్పుడు ‘జగనన్న విద్యా దీవెన’లో దానినే నాలుగు దఫాలుగా చెల్లిస్తోంది. దానిని కాలేజీలకు చెల్లించకుండా విద్యార్దుల తల్లితండ్రుల ఖాతాలలో జమా చేస్తోంది. ఆ డబ్బుతో వారు ఫీజు కడతారా లేదా? అనేది పక్కన పెడితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నగదు విడుదల చేసిన ప్రతీసారి రెండు తెలుగు రాష్ట్రాలలో న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చేస్తుంటాయి.

వాటికే ఏటా కోట్లాది రూపాయలు ఖర్చయిపోతున్నాయి. ఇక మిగిలిన పధకాలకూ ఇదే వర్తిస్తుంది కనుక అప్పులు తెచ్చి సంక్షేమ పధకాలకు చెల్లిస్తుండటం ఒక ఎత్తైతే, వాటి ప్రకటనల కోసం చేసే వందల కోట్ల ఖర్చు మరో ఎత్తు. ఇంకా విశేషమేమిటంటే, కొన్ని చిన్న పధకాలకు ప్రభుత్వం కేటాయించే సొమ్ము కంటే వాటి గురించి న్యూస్ పేపర్లలో ఇచ్చే ఫుల్ పేజీ ప్రకటలకి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది.

తమ సంక్షేమ పధకాల గురించి ఇంత ఖర్చు చేసి జనాలను ఊదరగొడుతున్నా, ఇంకా ఏమూలో చిన్న డౌట్! ఈ జనాలను కూర్చోబెట్టి ఇస్తుంటే డబ్బు తీసుకొంటున్నారు. పధకాలన్నీ కంఠోపాఠంగా అప్పజెప్పుతున్నారు. కానీ మళ్ళీ మనకే ఓట్లేస్తారా లేదా? అని. అందుకే మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను గడప గడపకు పంపించి ఆ డౌట్ క్లియర్ చేసుకొంటున్నట్లుంది.