YV Subba Reddy no ticketనిన్నటి దాకా టీటీడీ కి చెందిన నిరర్ధక ఆస్తులు అమ్మడాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ ప్రక్రియ ఎప్పటి నుండో ఉన్నదే అని, టీడీపీ హయాంలో కూడా జరిగిందని, పోనీ ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా సలహాలు ఇవ్వాలని రకరకాలుగా తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

అయితే విమర్శలు ఎక్కువ కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇప్పుడు అసలు అటువంటి ప్రతిపాదనే లేదు అన్నట్టు అదే సుబ్బారెడ్డి మాట్లాడటం విశేషం. టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై ఏకంగా విచారణ జరపాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలన్నారు. “నాలుకకు నరం లేదు అన్నట్టు… ఎటైనా మాట్లాడతారు అధికార పక్షం వారు. నిన్నటి వరకు అమ్మకాలను గట్టిగా సమర్ధించిన వారే నేడు అసలు అటువంటి మాట అంటేనే శిక్షించాలని కోరడం వారికే చెల్లింది,” అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా…. నేడు జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిరర్ధక ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని బోర్డు వెనక్కు తీసుకుంది. అలాగే నిరర్ధక ఆస్తులు కబ్జాకు గురి కాకుండా… ఎలా సద్వినియోగం చెయ్యాలి అనే సూచన చెయ్యడానికి ఒక కమిటిని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.