ys- jagan2019 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ఒక్కో నియోజకవర్గంలో 70 మంది యువకులను మోహరిస్తుందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం వైఎస్సార్‌సీపీకి పట్టున్న ప్రాంతాల్లో వారు సర్వేలు చేసి ఓటర్‌ ఐడీ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు తీసుకుంటున్నారని, వివరాలు చెప్పి, ట్యాబ్‌ల్లో వేలిముద్ర వేస్తే ఓటుహక్కు గోవిందా. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా బలంగా ఉన్న నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు జరుగుతుందని సాక్షి అంటోంది.

పైగా అలా నియోజకవర్గాలలో తిరిగే యువకుల వద్ద చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలతో టీడీపీ గుర్తింపు కార్డులు ఉంటున్నాయట. ఇప్పటికే ఇటువంటి ఆరోపణలు జనసేన శ్రేణులు కూడా చేశాయి. దానిని పవన్ కళ్యాణ్ కూడా మోయడం మనం చూశాం. ఇప్పుడు తాజాగా వైకాపా వంతు. గతంలో జనసేన గుంటూరులో ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు అక్కడి కలెక్టరు దానిపై వివరణ ఇచ్చారు. అధీకృత ఎన్నికల సంఘం అధికారులు తప్ప వేరే ఎవరికీ ఓట్లు తీసివేసే అధికారం ఉండదని వీటి పై వస్తున్నవన్నీ అనుమానాలు అపార్ధాలే అని ఆయన చెప్పుకొచ్చారు.

అయినా సాక్షి ఇదే పాట పాడుతుంది. ఒకవేళ ఈ ఆరోపణ నిజమే అనుకున్నా ఓట్లు తీయడానికి వైకాపాకు బలమైన నియోజకవర్గాలకు వచ్చే యువకులు తెలిసి తెలిసి చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలతో టీడీపీ గుర్తింపు కార్డులు ఎందుకు తెచ్చుకుంటారు? నేను దొంగను అని దొంగే మేడలో బోర్డు వేసుకుని ఎక్కడైనా తిరుగుతాడా? గుంటూరు నగరంలో సర్వేల పేరిట యువకులను నియమించి, 36 వేలకు పైగా ఓట్లను తొలగించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆరోపిస్తున్నారు. ఇవి గాలి ఆరోపణలు కాకపోతే వైకాపా ఈపాటికే కోర్టుకు వెళ్ళాలి. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎక్కడా వినిపించలేదు కూడా.