Visakha-Garjana-sabhaఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలను పూడ్చలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానంటూ హడావుడి చేస్తోందని ప్రతిపక్షాలు పదేపదే ఎద్దేవా చేస్తూనే ఉన్నా మా కుందేలుకి మూడే కాళ్ళు… కనుక మాకు మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ వాదించేవారు.

సరే… కర్ర ఉన్నవాడిదే బర్రె గనుక అధికారం వైసీపీ చేతిలోనే ఉంది గనుక మూడే కట్టుకొంటారో… ముప్పయ్యే కట్టుకొంటారో వాళ్ళిష్టం. కానీ మూడున్నరేళ్ళుగా వైసీపీలో అందరూ కలిసి పాడిందే పాటరా… అన్నట్లు మూడు రాజధానుల గుణగణాల గురించి కోరస్ పాడారే తప్ప ఇంతవరకు ఒక్క ఇటుక ఇటు తీసి అటు పెట్టలేదు… కట్టలేదు! కానీ అమరావతి కోసం భూములిచ్చిన రైతులు అరసవిల్లికి పాదయాత్రకు బయలుదేరితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని పనులు మానుకొని వారిని విమర్శించడం, వారిపైకి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పడమే పనిగా పెట్టుకొని చివరికి వారిని అడ్డుకొని వెనక్కు తిప్పి పంపేవరకు నిద్రపోలేదు.

పనిలో పనిగా అక్కడ కర్నూలులో న్యాయరాజధాని కోసం వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి, ఇక్కడ విశాఖ రాజధాని కోసం మంత్రులు ఎమ్మెల్యేలు గర్జించారు… గాండ్రించారు. ఏవో కనిపించని దుష్ట రాజకీయ శక్తులు మూడు రాజధానులకు అడ్డుపడుతున్నాయంటూ వారు చేసిన హడావుడి అంతా ఇంకా

కాదు. వైసీపీ వేధింపులు భరించలేక రాజధాని రైతులు పాదయాత్రని విరమించుకొని వెనక్కు వెళ్ళిపోగానే ఇంతవరకు విశాఖ రాజధాని కావాలంటూ హడావుడి చేసిన ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ వంటి వారందరూ కూడా ‘సైలెంట్ మోడ్‌’లోకి వెళ్లిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానని పదేపదే చెప్పుకొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. విశాఖ రాజధాని అయితేనే విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతుందని లేకుంటే వనకబడిపోతుందని బల్లగుద్ది వాదించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆ విషయమే మరిచిపోయారు.

అంటే వారికి విశాఖ రాజధాని అక్కరలేదా? కావాలనుకొంటే రాజీనామాలు చేస్తామనో లేదా మరొకటో చెప్పి సిఎం జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసేయవచ్చు కదా?కర్నూలులో కనీసం హైకోర్టుకి ఓ భవనమైనా నిర్మించొచ్చు కదా? కానీ ఇప్పుడు వైసీపీలో ఎవరూ మూడు రాజధానుల ఊసే ఎత్తడం లేదు! వారికి ఎవరు అడ్డుపడుతున్నారిప్పుడు?ఇంతకీ మూడు రాజధానులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెపుతారా? లేక వీటిని కూడా పోలవరంతో పాటు పూర్తి చేస్తామని చెపుతారా?

ప్రతీ అంశం మీద ఈవిదంగా రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఎన్నికలలో మాత్రం ప్రజలు తప్పకుండా ఈ ఐదేళ్ళ లెక్కలు చూసే ఓట్లేస్తారని మరిచిపోకుండా ఉంటే వారికే మంచిది.