Vijaya Sai Reddyవైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు, జగన్ కేసులలో రెండో ప్రధాన నిందితుడు విజయ సాయిరెడ్డి ఆ పార్టీలో జగన్ తరువాత నెంబర్ 2 అన్నట్టు. పార్టీ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన ట్విట్టర్ లో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు. అయితే ట్విట్టర్ లో ఆయన వాడే బాష తరచుగా వివాదాస్పదం అవుతుంది. పెద్దల సభ సభ్యుడిని అనే విషయం మర్చిపోయి ఆయన సోషల్ మీడియాలో ఉండే చిల్లర ట్రాల్స్ బాషలో తరచూ మాట్లాడేస్తూ ఉంటారు.

రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడేసి ట్వీట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఆయన ట్వీట్లు వెయ్యగానే అవి సాక్షి వెబ్ సైట్ లో ఆర్టికల్స్ అయిపోతాయి. మరుసటి రోజు పేపర్ లో దర్శనం ఇస్తాయి. అయితే నిత్యం బిజీగా ఉండే విజయసాయి రెడ్డి ఇంత యాక్టీవ్ గా ఉండగలరా అనే అనుమానం అందరిలోనూ ఉంది. మీడియా ముందు విజయసాయి రెడ్డి వాడే భాష ఏమీ ఘనంగా లేకపోయినా ట్విట్టర్ లో ఆయన వాడే భాష నిజంగానే ఆయనదా అనే అనుమానాలు కూడా ఉన్నవి.

వైఎస్సార్ కాంగ్రెస్ లోటస్ పాండ్ ఆఫీసులో పని చేసే ఒక వ్యక్తి సమాచారం ప్రకారం విజయ సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా నిర్వహణను ఒక జర్నలిస్టుకు అప్పగించారు. గతంలో పలు పెద్ద చానెల్స్ లో పని చేసిన అతను ఇప్పుడు ఒక కొత్త ఛానల్ లో ఉన్నారు. టీవీలో కంటే కూడా యూట్యూబ్ లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఎవరో యూట్యూబ్ లో డబ్బులు ఘనంగా వస్తాయి అని చెప్పగా దానిని పట్టుకున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం ఒకప్పుడు జనసేనకు బాగా మద్దతు ఇచ్చిన ఆయన స్వతాహా జగన్ అభిమాని.

ఆ జర్నలిస్టుకు నెలకు ఇతోధికంగా జీతం ఇస్తూ ట్విట్టర్ లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట విజయసాయి రెడ్డి. దీనితో టీవీ ప్రేక్షకుల కోసం న్యూట్రల్ ముసుగు తగిలించుకున్న ఆ జర్నలిస్టు ఈ వేదికలో చెలరేగిపోతున్నారు. ఆయన వేసే ట్వీట్లు సరైన భాషలో లేకపోయినా జగన్, విజయసాయి రెడ్డిల ఉద్దేశాలకు దగ్గరగా ఉండటంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్ మండలి పై వివాదాస్పద కార్టూన్ వేసి అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ కు పని చేసే ఒక కార్టూనిస్టు ఆ జర్నలిస్టు కు కావాల్సిన కార్టూన్లు వేసి ఇస్తారట. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్విట్టర్ ఖాతా నిర్వహణ సాక్షిలో పని చేసే జర్నలిస్టులకు ఇవ్వకపోవడం.