YSRCP-Uttarandhra-Ministers-JAC-Visakhapatnam-Capitalమూడు రాజధానులతో వికేంద్రీకరణ… ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధి అంటూ ఆ మూడు జిల్లాలకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోరస్ పాడుతున్నారు. విశాఖ రాజధానిని చేయడమే సర్వరోగ నివారిణి అన్నట్లు మాట్లాడుతున్నారు. విశాఖను రాజధాని చేయకుండా టిడిపి కుట్రలు పన్నుతూ ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధిని అడ్డుపడుతోందని వాదిస్తున్నారు.

ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధిపై వారికి నిజంగా అంత ఆసక్తి, తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఉత్తరాంద్ర జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేకపోయారు?ఉత్తరాంద్ర జిల్లాలకు పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెట్టుబడులను ఎందుకు రప్పించలేకపోయారు?కనీసం గుంతలు పడిన రోడ్లను ఎందుకు మరమత్తులు చేయించలేకపోయారు?విశాఖలో రాజధాని ఏర్పాటైతే తప్ప విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేరా?అనే ప్రశ్నలకు వారు ముందుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఇక ఉత్తరాంద్ర జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పుకోదలిస్తే చాలానే ఉంది. వాటి గురించి ఎంత క్లుప్తంగా చెప్పుకొన్నా పెద్ద గ్రంధమే అవుతుంది.

*రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలోని వంశధార-నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, వంశధార రెండో దశ పనులు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నేటికీ ఈ రెండూ పూర్తి కాలేదు. పైగా కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బకాయి బిల్లులు చెల్లించనే లేదు. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. పిలిచినా కాంట్రాక్టర్లు రావడం లేదు. దీంతో పాత ఒప్పందాలు రద్దు చేసి మళ్ళీ అంచనాలు పెంచేసి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు సమాచారం.

*విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మాణ పనులు, కుడివైపు ప్రధాన కలువ నిర్మాణం, దాని నుంచి లింకు కాలువల నిర్మాణ పనులు పూర్తిచేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీని కింద విజయనగరం, శ్రీకాకుళం రెండు జిల్లాలలో కలిపి 64 వేల ఎకరాల స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 1.31 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. అలాగే రెండు జిల్లాలో 287 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకి ఇంత ప్రాధాన్యం ఉంది కనుకనే గత ప్రభుత్వ హయాంలో 91 శాతం పనులు పూర్తిచేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే మిగిలిన ఆ 9 శాతం పనులు కూడా పూర్తి చేసి ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా మిగిలిన ఆ 9 శాతం పనులు పూర్తిచేయలేకపోయింది.

*విజయనగరం జిల్లాలోనే గుర్ల మండలంలో కోటగండ్రేడు వద్ద తారకరామతీర్దసాగరం పేరుతో చంపావతి నదిపై బ్యారేజి నిర్మాణ పనులలో 47.51 శాతం పనులను గత ప్రభుత్వం పూర్తి చేసింది. దీని ద్వారా జిల్లాలో 8,172 ఎకరాల స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 16,538 ఎకరాలకు సాగునీరు అందుతాయి. దీని కోసం జగన్ ప్రభుత్వం 2020, ఏప్రిల్ నెలలో రూ.739.90 కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ మూడున్నరేళ్ళలో మరో 10 శాతం పనులను మాత్రమే పూర్తి చేయగలిగింది.

*శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నది నుంచి 1.76 టీఎంసీల నీళ్ళను తరలించి నిలువచేసేందుకు గత ప్రభుత్వం మెళియాపుట్టి మండలంలో ఓ జలాశయం నిర్మించేందుకు రూ.229 కోట్లు ఖర్చుచేసింది. ఈ జలాశయం పూర్తయితే దీని నుంచి 24,600 ఎకరాలకు సాగునీరు, 134 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. కానీ ఈ మూడున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం కేవలం రూ.48 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కానీ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.852.45 కోట్లకు పెంచుతూ 2021, సెప్టెంబర్‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది.

ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఉత్తరాంద్ర జిల్లాలకు ప్రాణం పోసే ఈ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్ళుగా పూర్తిచేయకుండా ఎందుకు కూర్చుంది? విశాఖ రాజధానికి ఈ పనులకు ఏమైనా సంబందం ఉందా?అనే ప్రశ్నలకు ఆయా జిల్లాల మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే సమాధానాలు చెప్పాలి.