YSRCP targets TDP votes with Form7రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగించమని ఎక్కడికక్కడ ఫారం-7 పెట్టి అడిగామని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఒప్పుకున్నారు. దీనితో ఈ వివాదం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మెడకు చుట్టుకున్నట్టు అయ్యింది. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 8.72 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 90 శాతం గత పది రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో వచ్చినవే. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.09 లక్షల మంది పేరిట ఈ ముఠా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారంటే ఇది ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది.

ఇన్ని లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించటం చాలా కష్టసాధ్యం. ఈ క్రమంలో అర్హుల ఓట్లు గల్లంతై, అనర్హుల ఓట్లు జాబితాలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర పరిశీలన చేసిన ఎన్నికల సంఘం..అందులో అత్యధిక శాతం దరఖాస్తులు నకిలీవేనని గుర్తించింది. ఓటర్లు ఆయా గ్రామాల్లోనే నివాసముంటున్నప్పటికీ వారికి తెలియకుండానే మోసపూరితంగా ఎవరో వ్యక్తులు ఇలా నకిలీ దరఖాస్తులు పెట్టారని తేల్చింది. దీని బట్టి ఇవన్నీ బోగస్ అప్లికేషన్లని తెలుస్తుంది.

దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీ ఓటర్లనే లక్ష్యంగా ఈ అప్లికేషన్లు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించాలంటూ క్రిమినల్‌ కేసులు పెట్టింది. స్థానికంగా ఆయా తహసీల్దార్ల ఫిర్యాదుల మేరకు ఎక్కడికక్కడ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలపై మంగళవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్ స్వయంగా ఒప్పుకోవడంతో ఈ కేసులలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇబ్బంది పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.