Jr NTR YSRCP
తెలుగుదేశం పార్టీని కార్నర్ చేయడానికి వైసీపీ విరివిగా వాడే అస్త్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు. ఒకానొక సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు – జూనియర్ ఎన్టీఆర్ కు నడుమ ఉన్న గ్యాప్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతం అయిన వైసీపీ, ప్రతిసారి అదే సూత్రాన్ని అవలంభిస్తూ తారక్ ను టార్గెట్ చేస్తోంది.

తాజాగా జిల్లాల సంఖ్యను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసింది. దీనికి గానూ జూనియర్ ఎన్టీఆర్ కనీసం కృతజ్ఞత కూడా వ్యక్తం చేయలేదనేది వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. నిత్యం తాత పేరు చెప్పుకునే తారక్, ఓ మహత్తర నిర్ణయం తీసుకున్నందుకు జగన్ కు కృతజ్ఞతలు చెప్పలేదనేది వీరి ఆవేదన.

అయితే వైసీపీ లెక్క ప్రకారమే వెళ్లినా… ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ఓ ప్రతిపాదన మాత్రమే. దీని మీద ప్రజల అభ్యంతరాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చని రెండు నెలల సమయాన్ని కూడా కేటాయించింది. అంటే ఇప్పుడు ప్రకటించిన పేర్లే ఫైనల్ కాదు, ఇందులో మార్పులు – చేర్పులు ఉంటాయని జగన్ సర్కారే చెప్పింది.

అత్యంత కీలకమైన మరో అంశం ఏమిటంటే, జిల్లాల పెంపు ప్రాతిపదిక ఇప్పట్లో జరిగే అంశం కాదని రాజకీయ విశ్లేషకులు తేల్చేసారు. కేంద్ర నిబంధనలు దీనికి అడ్డుగా ఉన్నాయని, కేంద్రం ‘జనగణన’ పూర్తయ్యే వరకు కొత్తగా ఎలాంటి జిల్లాల పెంపు గానీ, సరిహద్దులు గానీ కదపడానికి వీల్లేదని మీడియా వర్గాల వేదికగా పలువురు విశ్లేషకులు ఇప్పటికే స్పష్టం చేసారు.

ఒకవేళ కేంద్రం కూడా అనుమతులు ఇచ్చి, జిల్లాల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు లేని ఊరుకు జిల్లా పేరు పెట్టడమేంటి? అన్న చర్చ ఇప్పటికే దారి తీసింది. కేవలం రాజకీయ కోణంలోనే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని, నిజంగా వైసీపీ సర్కార్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ పేరేదో మచిలీపట్టణం ప్రాంతానికి పెట్టేవారని అభిప్రాయ పడుతున్నారు.

ఆలూ లేదు, శూలు లేదు, అల్లుడేమో సోమలింగం అన్నట్లు, కేవలం ఎన్టీఆర్ జిల్లా అనే ఓ సాధారణ ప్రకటనతో జూనియర్ ఎన్టీఆర్ మరుక్షణం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పేయాలా? అందుకే ఈ సారి తారక్ అభిమానులే వైసీపీ వర్గాలకు ఓ స్థాయిలో బదులు ఇస్తున్నారు. తారక్ పై చేసిన పోస్ట్ లను వైసీపీ వర్గం డిలీట్ చేసినప్పటికీ, ఆ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ వాటికి బదులిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దృష్టాంతా సినిమాలపైనే ఉంది. వైసీపీ వర్గాలకు చేస్తోన్న రాజకీయాలకు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడం అసాధ్యం. ఇలా జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని అడ్డం పెట్టుకునే గతంలో వైసీపీ విజయవంతం అయ్యింది. మళ్ళీ అలాంటి రాజకీయాలకే తెరలేపింది గానీ, ఈ సారి అభిమానులే అడ్డుపడడంతో పోస్ట్ లను డిలీట్ చేయక తప్పలేదు.

ఇటీవల కాలంలో నందమూరి – నారా కుటుంబాలు దగ్గరవుతున్న తరుణంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకురావడం వెనుక వైసీపీ ఉద్దేశం ఏమిటో? చంద్రబాబు సతీమణి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో పోస్ట్ చేసి తన మద్దతు ప్రకటించిన విషయాన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రస్తావించడంతో, ఈ విషయం వైసీపీ వర్గాలకు ఏ మాత్రం మింగుడు పడలేదని అర్ధమవుతోంది. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సారి ఫుల్ క్లారిటీతో ఉన్నట్లున్నారు.