YS-Jagan_Pawan-KalyanYS-Jagan_Pawan-Kalyanఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్ష సాధింపులు పతాకస్థాయికి చేరుకొన్నట్లు కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ సీఐడీ పోలీసులు నర్సీపట్నంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయనతో సహా ఇద్దరి కుమారులను కూడా అరెస్ట్ చేసి పట్టుకుపోయారు. తాజాగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్ద కూడా నిఘా పెట్టారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు.

“విశాఖ సంఘటన తర్వాత పవన్‌ కళ్యాణ్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు మేము గుర్తించాము. పవన్‌ కళ్యాణ్‌ కారులో వెళుతున్నప్పుడు కొందరు వ్యక్తులు బైక్‌లపై ఆయనను అనుసరిస్తున్నారు. కానీ వారెవరూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కారని మేము గుర్తించాము. మొన్న సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు కారు అడ్డంగా పెట్టి సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకొన్నారు. నిన్న బుదవారం ఉదయం కూడా కొందరు ఆయన వాహనాన్ని వెనక నుంచి అనుసరిస్తూ ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ ఘటనలపై మేము తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జ్‌ శంకర్ గౌడ్‌ తెలియజేయడంతో ఆయన వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు” అని ఆ లేఖలో నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, ప్రతిపక్ష నాయకులను ఇంతగా వేధించవలసిన అవసరం ఏమిటి? వారి కదలికలపై నిఘా పెట్టవలసిన అవసరం ఏమిటి?అంటే 175 సీట్లు గురించి తాను చెపుతున్న మాటలపై తనకే నమ్మకం లేదనుకోవాలా?టిడిపి, జనసేనలను ఈవిదంగా భయబ్రాంతులను చేయవచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందేమో కానీ వీటన్నిటినీ నిశితంగా గమనిస్తున్న సామాన్య ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసుకొంటున్నామని గ్రహిస్తునట్లు లేదు.

ఎన్నడూ బయటకి వచ్చి మాట్లాడని చింతకాయల అయ్యన్నపాత్రుడు అర్దాంగి పద్మావతి ఈరోజు తెల్లవారుజామున మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆలోచింపజేయకుండా ఉంటాయా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలను కనిపించకుండా తుడిచిపెట్టేయాలని ప్రయత్నించి ఇప్పుడు ఓ సాధారణ ఉపఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి ఏటికి ఎదురీదుతున్నారు. కనుక అదే పొరపాటు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రేపు ఏపీలో ఇటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది.