Kiliveti Sanjeevaiah Tractor Rallyలాక్ డౌన్ ఆదేశాలను ధిక్కరించిమరీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం, అది కాస్తా వైరస్ వ్యాప్తికి ఊతమివ్వడంతో శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూర్ జిల్లాలోని ఒక చిన్న పట్నమైన శ్రీకాళహస్తిలో ఇప్పటికే 50కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఈ విషయంలో జాతీయ మీడియా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యాన్ని ఉతికి ఆరేస్తుంది. అది కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే తాజాగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సరుకుల పంపిణీ పేరుతో 30 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని నాయుడుపేటలో మంత్రి అనిల్, సూళ్లూరుపేటలో ఎంపీ వేమిరెడ్డి పచ్చజెండాలు ఊపి సరుకుల పంపిణీ ప్రారంభించారు. స్థానిక వైసీపీ నేతలు పారిశ్రామికవేత్తల నుంచి భారీగా విరాళాలు సేకరించి రూ. 2కోట్ల విలువైన నిత్యావసరాలను జగనన్న కానుక పేరిట ప్రజలకు పంపిణీ చేశారని సమాచారం. కరోనా కేసులతో అల్లాడుతున్న శ్రీకాళహస్తి పక్కనే సూళ్లూరుపేట నియోజకవర్గం ఉంది.

ఇప్పుడు ఈ విషయం కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తుంది. సహజంగా ఇటువంటి వార్తలు మీడియాలో వచ్చినప్పుడు యెల్లో మీడియా అని, టీడీపీ అనుకూల మీడియా అని ఏవేవో ముద్రలు వేసి అసలు విషయాన్నీ పక్కదారి పట్టించేస్తారు. అయితే ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా జాతీయ మీడియా ఈ విషయాలను ప్రముఖంగా ప్రసారం చెయ్యడంతో వారికి ఎటూ తోచడం లేదు.