YSRCP social media links rajya sabha seat to polavaram projectపోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా… 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా భరించేందుకు సిద్ధం అని కేంద్రం ప్రకటించింది. ఇది జగన్ ప్రభుత్వం అతి పెద్ద విక్టరీగా వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేస్తుంది.

పైగా ఇటీవలే రిలయన్స్ కు చెందిన పరిమళ్ నత్వాని ని ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు నామినేట్ చెయ్యడం వల్లే ఇది సాధ్యమైందని వారు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా జగనన్న అంటూ డంకా వాయిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇది కేవలం రాజకీయ ప్రచారమే అంటున్నారు.

“2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడింది. జాతీయ ప్రాజెక్టు అనేది ఎప్పుడు ఎక్కడ జరిగినా దాని పూర్తి ఖర్చు… ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. పోలవరం విషయంలో కూడా అంతే. రాష్ట్రానికి ఇప్పుడు కేంద్రం కొత్తగా చేసింది ఏమీ లేదు,” అని వారు అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 55వేల 545 కోట్లుకు సవరించింది. అయితే, అందులో 48వేల కోట్లు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సుమారు 16వేల కోట్లు ఖర్చు చేసింది. తాజాగా సవరించిన అంచనాలు, కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం మరో 32వేల కోట్లు కూడా కేంద్రమే భరించనుంది. అందులో భూసేకరణ, పునరావాల పనులకు 27వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.