Pawan-Kalyan-Rojaఏపీలో ప్రజలకి మంత్రులు పేర్లు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కానీ వారు నిర్వహిస్తున్న శాఖలు తెలియవంటే అతిశయోక్తి కాదు. అది ప్రజల తప్పు కాదు. ఒక్క ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తప్ప మిగిలిన మంత్రులెవరూ తమ శాఖలకి సంబందించిన పనులు లేదా నిర్ణయాల గురించి మాట్లాడరు. ఎప్పుడు ప్రజలు లేదా మీడియా ముందుకు వచ్చినా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ లేదా మూడు రాజధానులు, సంక్షేమ పధకాల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. కనుక వారు ఆయా శాఖల మంత్రులగా కంటే కేవలం మంత్రులుగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.

అటువంటివారిలో ఆర్‌కె. రోజా కూడా ఒకరు. ఎప్పటికైనా మంత్రి అవ్వాలని కలలుగన్న ఆమె పర్యాటక శాఖ మంత్రి అయినప్పుడు మంత్రిగా తన శాఖకి, రాష్ట్రానికి, న్యాయం చేయలనే ఆలోచన, తపన లేకుండా ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శించడానికే పరిమితమవుతుంటారు లేదా నెలకోసారి అనుచరులని వెంటబెట్టుకొని తిరుమలపై దండయాత్ర చేస్తుంటారు. అంతే!

విశాఖలో జరిగిన జగనన్న సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి రోజా, మీడియాతో మాట్లాడుతూ, “పవన్‌ కళ్యాణ్‌ ఓ వీకెండ్ పొలిటీషియన్. ఆయనకి సినిమా షూటింగులలో విరామం దొరికినప్పుడు హడావుడిగా ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి ఏదో స్టేట్‌మెంట్ ఇచ్చో లేదా తన వారాహియో నారాహియో వాహనం ఫోటోలు పెడుతుంటారు లేదా రంగురంగుల చొక్కాలు వేసుకొని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఓ సినిమా హిట్ అవ్వాలంటే అందులో కంటెంట్ ఉండాలి. కానీ మన వీకెండ్ పీకేలో ఆ కంటెంట్ లేదు కనుకనే జనసేన ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుంది,” అని ఎద్దేవా చేశారు.

రోజా తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోలో పాల్గొంటూనే, పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారనే సంగతి మరిచిపోయిన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయడాన్ని ఎద్దేవా చేస్తున్నారిప్పుడు. నిజానికి మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా తన మనసంతా జబర్దస్త్ మీదే ఉందని ఇటీవలే రోజా స్వయంగా చెప్పుకొన్నారు కూడా. తాను జబర్దస్త్ షో చేయడం తప్పుకానప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయడం తప్పు ఎలా అవుతుంది?

ఒకవేళ ఆమె చెపుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ వీకెండ్ పొలిటీషియనే అయితే దాని వలన నష్టపోయేది ఆయనే కానీ ఆమె కాదు కదా?జనసేన అట్టర్ ఫ్లాప్ షో అవుతుందని బల్లగుద్ది వాదిస్తున్నప్పుడు పదేపదే ఆ పార్టీ గురించి, దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించి సిఎం జగన్‌తో సహా వైసీపీ మంత్రులు అందరూ ఆ పార్టీని, ఆయనని చూసి ఎందుకు భయపడుతున్నారు?ఆ పార్టీని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?అంటే జనసేనకి, పవన్‌ కళ్యాణ్‌కి రాష్ట్రంలో ప్రజాధారణ పెరుగుతోందని, ఆయన ఇప్పుడు మరింత రాజకీయ పరిపక్వతతో అడుగులు ముందుకు వేస్తున్నారని, జనసేన వలన వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎంతో కొంత నష్టం తప్పదనే భయం చేతనే కదా?

చివరిగా ఒక్క విషయం చెప్పుకోవాలి. వైసీపీ మంత్రులు ప్రతిపక్ష నేతలని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడుతూ తాము చాలా తెలివిగా, అందరినీ ఆకట్టుకొనేలా మాట్లాడుతున్నామనుకొంటున్నట్లున్నారు. కానీ తమ నోటి దురుసు, అవహేళనలతో ప్రజల దృష్టిలో తమను తామే చులకన చేసుకొంటున్నామనే సంగతి మరిచిపోతున్నారు.