YSRCP MP-Raghu-Rama-Krishna-Rajuవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు 60వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అయన గత ఏడాది ఇదే రోజున ఏపీ సిఐడీ పోలీసులు పెట్టిన చిత్ర హింసలను గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా జీవితంలో ఏనాడూ అంతటి భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తానని ఊహించలేదు. చిన్నప్పటి నుంచి చదువులలో ముందుండేవాడిని కావడంతో క్లాసులో టీచర్లు కూడా నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కానీ ఆ రోజు పోలీసులు నన్ను కింద పడేసి నా గుండెలపై కూర్చొని తీవ్రంగా కొట్టారు. ఇటువంటి ఉన్మాద ముఖ్యమంత్రిని నేనెన్నడూ చూడలేదు. అతనికి ప్రజలే వచ్చే ఎన్నికలలో సరైన గుణపాఠం చెపుతారు,” అని రఘురామ అన్నారు.

వైఎస్సార్ పార్టీకే చెందిన ఓ ఎంపీని కేసు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడం ఆనాడు దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. నాటికీ నేటికీ ఏపీలో అవే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు. ఆంద్రప్రదేశ్‌ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ధూళిపాల నరేంద్రను, ఇటీవల మాజీ మంత్రి పి.నారాయణ…ఇలా చాలామందిపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నన సంగతి అందరికీ తెలిసిందే.

ఇందుకు మరో తాజా నిదర్శనం చిలుకలూరిపేటలో పోలీసులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమే. ఈరోజు చిలుకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల త్రాగునీటి పధకం ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు పత్తిపాటి పుల్లారావు ఒక మహిళా అధికారిని పక్కకు నెట్టేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఆయనతో సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.

తమ ప్రభుత్వం ఎన్నడూ ఎవరి మీద రాజకీయకక్ష సాధింపులకు పాల్పడలేదని సజ్జల రామకృష్ణ వంటి వైసీపీ నేతలు చెపుతుంటారు. కానీ మరోపక్క వారి ప్రభుత్వం ఈవిధంగా ప్రతిపక్ష నేతలపై ఏదో ఓ వంకతో కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ కేసులు, వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు మరో రెండేళ్లు భరించక తప్పదని చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు ధైర్యం చెపుతున్నారు. కనుక అంతవరకు టిడిపి శ్రేణులు ఓపికగా ఎదురుచూడక తప్పదు.