2500 Acres of Amaravati For Land for the Poor Scheme -Jagan (3)శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. మండలి రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ సర్కార్ పంపనుంది. పార్లమెంట్‌లోనూ బిల్లు ఆమోదం పొందాలి.

అయితే మండలి రద్దుపై చివరి నిముషం వరకూ సస్పెన్స్ కొనసాగింది. 2021 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ కు మండలిలో మెజారిటీ రానుండడంతో అధికార పక్షం చివరి నిముషం వరకు ఆపరేషన్ ఆకర్ష ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీ సమావేశాలకు మూడురోజులు విరామం ఇవ్వడంతో ఈ వ్యవధిలో మరికొన్ని ఫిరాయింపులు చోటు చేసుకోవచ్చని విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని వార్తలు వస్తున్నాయి. ముందుగా వెళ్ళిపోయిన ఇద్దరు తప్ప ఎవరూ స్పందించలేదు. ఎన్ని ఒత్తిళ్లున్నా ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి మొత్తం 23మంది హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదుగురు ముందస్తు సమాచారం ఇచ్చి పార్టీ అనుమతితో రాలేదు.

చివరకు లాభం లేదు అనుకుని రద్దు వైపే ప్రభుత్వం మొగ్గు చూపిందని అంటున్నారు. మరోవైపు మండలి రద్దయితే ఇద్దరు మంత్రులు తమ పదవులు కోల్పోనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మండలిలో సభ్యులుగా ఉన్నారు. వారిద్దరినీ ముఖ్యమంత్రి రాజ్యసభకు పంపనున్నారని సమాచారం.