Minister Taneti Vanithaఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం, సీదిరి అప్పలరాజుని మంత్రి పదవి పీకేయబోతుండటంతో వైసీపీ అధినేత జగన్‌ వీటిని చాలా సీరియస్‌గానే తీసుకొన్నారని అర్దమవుతోంది. ఇప్పుడు వైసీపీలో మరో వికెట్ పడబోతున్న సూచనలు వచ్చాయి. ఈసారి రాష్ట్ర హొమ్ మంత్రి తానేటి వనితని పదవిలో నుంచి తప్పించవచ్చని ఆమె మాటలతోనే స్పష్టం అవుతోంది.

తన మంత్రివర్గంలో మంత్రులందరూ చాలా యాక్టివ్‌గా, అగ్రెసివ్‌గా ఉండాలని, ఒకవేళ ఎవరైనా ఆవిదంగా లేకపోతే పదవిలో నుంచి తప్పించడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందే తమకు చెప్పారని మంత్రి తానేటి వనిత అన్నారు. ఒకవేళ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఒకరిద్దరిని మార్చాలనుకొంటే ఆయన నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని మంత్రి తానేటి వనిత అన్నారు.

మంత్రి పదవి పోగొట్టుకోబోతున్నవారే ఇటువంటి మాటలు మాట్లాడుతారని వేరే చెప్పక్కరలేదు. మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి బయటకువచ్చిన తర్వాత ఇంచుమించు ఇదేవిదంగా మాట్లాడారు. ఇప్పుడు మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. కనుక వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఆమెదే అని భావించవచ్చు. సోమవారం సిఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం జరుగనుంది. దానిలో సిఎం జగన్‌ ఎవరెవరిని మంత్రివర్గంలో నుంచి తొలగించబోతున్నారు? వారి స్థానంలో ఎవరికి మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారనే దానిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మంత్రి సీదిరి అప్పలరాజును తొలగించి శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను తీసుకోబోతున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. అలాగే సిఎం జగన్‌ కోరుకొన్నట్లు వైసీపీలో చాలా యాక్టివ్‌గా, అగ్రెసివ్‌గా ఉండే కొడాలి నానిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని సమాచారం. ఒకవేళ తానేటి వనితను మంత్రి పదవిలో నుంచి తొలగిస్తే ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారో? కొడాలి నాని, తమ్మినేని సీతారాంలకు ఏ శాఖలు కేటాయిస్తారో? చూడాలి. జగనన్న కోరుకొనే లక్షణాలన్నీ కొడాలి నానికి ఉన్నందున హోమ్ మంత్రి పదవి ఇస్తారేమో?