YSRCP_Nellore_Kotamreddy_Sridhar_Reddyనెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ వైసీపీ ప్రభుత్వమే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తోందని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. అయితే అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని ఫోన్‌ రికార్డింగ్ అని వైసీపీ నేతలు విజయవంతంగా నిరూపించగలిగారు. దశాబ్ధాలుగా రాజకీయాలలో, అందునా… దేశముదురు నేతలందరూ ఉండే వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌కి, ఫోన్‌ రికార్డింగ్‌కి తేడా తెలియదనుకోలేము. కనుక అంతకి మించి వైసీపీలో ఆయనకి ఏదో జరిగి ఉండాలి. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ వంకతో పార్టీలో నుంచి బయటకి వచ్చేసి ఉండవచ్చు.

ఒకవేళ పార్టీలో నుంచి ఇంత ముందుగా బయటకి వెళ్తే తమ ప్రభుత్వం ఏవిదంగా కక్ష సాధింపులకి పాల్పడుతుందో తెలిసి ఉన్నా మనసు చంపుకొని పార్టీలో కొనసాగలేక ముందుగానే బయటకి వచ్చేశానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటిరోజే స్పష్టంగా చెప్పారు. ఆయన మొదట టిడిపి తరపున పోటీ చేస్తానని చెప్పినప్పటికీ, టిడిపిలో చేరేందుకు ఇన్ని నెలల ముందుగా పార్టీని వీడి బయటకి రావడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది.

కనుక ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు. టిడిపిలో చేరేందుకు కాదు. మరి దేనికి ఆయన హటాత్తుగా అధికారంలో ఉన్న వైసీపీలో నుంచి బయటకి వచ్చేశారు?అంటే ఆయన తాడేపల్లి వెళ్ళి సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాతే బయటకి వచ్చేశారు. బహుశః అప్పుడే సిఎం జగన్‌ ఆయనకి వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చు.

స్వతహాగా చాలా ఆవేశపరుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అది తట్టుకోలేకనే ఆవేశంతో బయటకి వచ్చేశారేమో?పార్టీలో చాలామంది సీనియర్ నేతలు తనలాగే అవమానాలు భరిస్తూ మౌనంగా ఉండిపోయారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలిరోజే చెప్పారు. కనుక ఆయన ఆవేశంతో తొందరపాటుతోనే బయటకి వచ్చేసిన్నట్లు అర్దమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఆయన ఊహించిన్నట్లే ఇప్పుడు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. కనుక ఆయన ఎదుర్కొంటున్న మూకుమ్మడి ఎదురుదాడులు, కక్ష సాధింపులు చూస్తున్న వైసీపీ నేతలు ఎవరూ ఇప్పుడు పార్టీలో నుంచి బయటకి వెళ్ళే సాహసం చేయరని చెప్పవచ్చు.