Vasantha Venkata Krishna Prasadవైసీపీ ఎమ్మెల్యే అంటే తిరుగే ఉండదు… కానీ పాపం మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కి సొంత ఇంట్లోని, నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ హోమ్ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వసంత నాగేశ్వర రావు కొన్ని రోజుల క్రితం జగన్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఓ కారణమైతే, నియోజకవర్గం వైసీపీలో గ్రూపులు మరో తలనొప్పిగా మారాయి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కి.

ఇటీవల ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ ప్రభుత్వంలో కమ్మసామాజిక వర్గానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం లేకుండా పోయింది. రెడ్డి, కాపు సామాజిక వర్గాలకే పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. నా కొడుకు వసంత వెంకట కృష్ణప్రసాద్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం నన్ను బాధిస్తోంది. జగన్‌ ప్రభుత్వం అమరావతిని కాదని మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం కూడా సమంజసంగా లేదు. అమరావతినే రాజధానిగా చేస్తే మంచిదని భావిస్తున్నాను,” అని అన్నారు.

“మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో నేనే పోటీ చేయబోతున్నాను.. నాకే టికెట్‌ని ఖాయం…” అంటూ నియోజకవర్గంలోని ఓ వైసీపీ నేత ప్రచారం చేసుకొంటుండటం వసంత వెంకట కృష్ణప్రసాద్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు… మైలవరం నుంచి ఆయనకే సిఎం జగన్‌ టికెట్‌ని ఖరారు చేస్తే, ఎన్నికల వరకు ఆయనతో కలిసి పనిచేయడానికి తనకు ఇబ్బంది లేదంటూ నిన్న పార్టీ కార్యాలయంలో విస్పష్టంగా చెప్పేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానని కానీ నియోజకవర్గంలో పార్టీ చీలిపోతుందంటే తాను తప్పుకోవడానికి సిద్దమని తేల్చిచెప్పేశారు. ఈ తలనొప్పులు భరించలేకనే మూడు వారాలుగా పార్టీ కార్యాలయానికి కూడా రావడంలేదని వసంత వెంకట కృష్ణప్రసాద్‌ అన్నారు. కానీ ఇంకా ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఒకవేళ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ని, అభ్యర్ధిని మార్చాలని ఎవరైనా కోరుకొంటున్నట్లయితే నిరభ్యంతరంగా పార్టీ అధిష్టానానికి చెప్పుకోవచ్చునని వసంత వెంకట కృష్ణప్రసాద్‌ అన్నారు. వచ్చే ఎన్నికలలో తనకు కాకుండా వేరేవారికి టికెట్‌ ఇవ్వాలనుకొన్నా అభ్యంతరం చెప్పనని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పదవులు అధికారం కోసం తాను ఎన్నడూ తాపత్రయపడలేదని వసంత వెంకట కృష్ణప్రసాద్‌ చెప్పారు.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, అమరావతిని రాజధానిగా కొనసాగించడం గురించి తన తండ్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమని, ఆయనను తాను అడ్డుకోలేనని చెప్పారు. కనుక పార్టీలో ఎవరూ ఆయన మాటలను తీవ్రంగా పరిగణించవద్దని వసంత వెంకట కృష్ణప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.