Vijaysai_Reddy_YSRCP_MPనేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విచారిస్తుండటంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దీనికి ఈడీని, కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ ఆధారంగానే ఈ కేసు నడుస్తోంది. కనుక ఈడీ విచారణకు రాజకీయాలు ఆపాదించడం తగదు. కర్మ సిద్దాంతం ప్రకారం చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు,” అని అన్నారు.

విజయసాయి రెడ్డి కర్మ సిద్దాంతం గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ప్రభుత్వం ఆదేశం మేరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అక్రమస్తుల కేసులో లోతుగా దర్యాప్తు జరిపి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలతో సహా మరో 12 మందిపై ఒకటీ రెండూ కాదు… ఏకంగా 11 ఛార్జ్ షీట్లు వేయడంతో ఆ కేసులలో వారు 16 నెలలు చెంచల్‌గూడ జైలులో గడిపారు.

అప్పుడు వారు కూడా యూపీయే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కలిసి తమపై రాజకీయ కక్షతో అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు తప్ప కర్మ సిద్దాంతం ప్రకారం చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని అనుకోలేదు.

నేటికీ ఆ కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఆ కర్మ సిద్దాంతం తమకు వర్తింపజేయకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వానికి వైసీపీ బేషరతు మద్దతు కొనసాగుతూనే ఉంది. కనుక ఆ అక్రమస్తుల కేసుల విచారణ కూడా తెలుగు టీవీ సీరియల్స్‌లాగ మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కొనసాగుతూనే ఉండవచ్చు.