YSRCP-MP-Vijaya-Sai-Reddy-రాష్ట్ర విభజన సమస్యలపై నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుచేయడం సాధ్యం కాదని రైల్వేఅధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

వాటిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ, “అసలు నిన్నటి సమావేశంలో రైల్వేజోన్ ఏర్పాటు అంశం చర్చించనే లేదు. మా ప్రభుత్వంపై బురద జల్లెందుకే ఎల్లో మీడియా ఈ దుష్ప్రచారం మొదలుపెట్టింది. విశాఖకు తప్పకుండా రైల్వేజోన్ వచ్చి తీరుతుంది. రాకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తాను,” అని అన్నారు.

నిన్న సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందా లేదా?అనేది పక్కనపెడితే, ఏపీకి ప్రత్యేకహోదా దక్కకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని, భావితరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆనాడు నిరాహారదీక్షలు, ధర్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడిచినా ఇంతవరకు ప్రత్యేకహోదా సాధించలేకపోయారు. మీడియాలో చాటుకొనేందుకే అప్పుడప్పుడు మొక్కుబడిగా ప్రధాని నరేంద్రమోడీ అడుగుతుంటారు.

ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వనని స్పష్టంగా చెపుతోంది కనుక అడిగి ప్రయోజనం లేదని సరిపెట్టుకోవచ్చు. కానీ రైల్వేజోన్ ఇవ్వనని ఇంతవరకు చెప్పలేదు కదా?అయినా ఇంతవరకు జగన్ ప్రభుత్వం దాని కోసం ఎందుకు పట్టుబట్టి సాధించలేదు?అంటే చిత్తశుద్ధి లేకపోవడం, కేసుల భయం, అప్పుల కోసమే అని చెప్పకతప్పదు.

మూడేళ్ళుగా ప్రయత్నించనిదాని కోసం విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికే. ఒకవేళ విశాఖకు రైల్వేజోన్ సాధించుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పరు. ముందు రాజీనామా చేసి చెపుతారు.

మూడు రాజధానులు అంటూ మూడేళ్ళు కాలక్షేపం చేసేసినట్లే రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తా అంటూ మిగిలిన రెండేళ్ళు విజయసాయి రెడ్డి కాలక్షేపం చేయడం ఖాయం . అయినా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయగల పరిస్థితిలో ఉన్నారా మన ముఖ్యమంత్రి, ఎంపీలు? చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక విశాఖకు రైల్వేజోన్ రాదు… అయినా విజయసాయి రెడ్డి రాజీనామా కూడా చేయరు.