ysrcp-mp-vijaya-sai-reddy-about-andhra-pradesh-3-capitals-in-rajya-sabhaఏపీ రాజధాని గురించి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పంచాయతీ పెట్టి రాష్ట్రం పరువు తీసింది చాలదన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో కూడా ఇదే అంశం ప్రస్తావించి తన పరువు, రాష్ట్రం పరువు కూడా తీసేశారు.

కేంద్రం చేత మూడు రాజధానులకి అభ్యంతరం లేదని, రాజధాని విషయంలో కలుగజేసుకోదని పార్లమెంటు సమావేశాలలో చెప్పించి రాష్ట్రంలో ప్రతిపక్షాల నోళ్ళు మూయించేయాలనుకొన్నారు విజయసాయి రెడ్డి. అందుకే కేంద్రానికి రెండు ప్రశ్నలు సందించారు.

1. రాజధాని ఏర్పాటు రాష్ట్రాల పరిధిలో అంశామని ఇదివరకు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా లేదా?

2. ఒకవేళ చెప్పి ఉంటే, ఆ ప్రకారం మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తాజా తీర్పు విరుద్దంగా ఉన్నట్లే కదా?

ఈ రెండు ప్రశ్నలకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన ఏం సమాధానాలు చెప్పారంటే…

1. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లులో సెక్షన్స్ 5,6 ప్రకారం ఏపీకి రాజధానిని నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ సమర్పించిన నివేదికపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయిస్తూ 23-04-2015న నోటిఫై చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ (ఏపీసీఆర్‌డీఏ)ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ కోసం ఏపీసీఆర్‌డీఏని రద్దు చేసి 2020లో మూడు రాజధానులు ఏర్పాటు కోసం ఏపీడిఐడిఏఆర్ చట్టం చేసింది.

2. అయితే మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయలేదు. 2021లో హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో మూడు రాజధానుల కోసం చేసిన ఏపీడిఐడిఏఆర్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొంది. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున ఇంతకి మించి వివరణ ఇవ్వడం సాధ్యం కాదు.

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదలచుకోనప్పటికీ, నేటికీ చట్టబద్దంగా ఏర్పడిన అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నామని విస్పష్టంగా చెప్పింది. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాట గురించి తమకి తెలుసునని, అయితే వైసీపీ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం తమకి చెప్పలేదు కనుక దాని గురించి కేంద్రానికి అనవసరమని భావిస్తున్నట్లు తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని గురించి పార్లమెంటు సమావేశాలలో ఇంత స్పష్టంగా చెప్పడంతో వైసీపీ తాను తవ్వుకొన్న గోతిలో తానే పడిన్నట్లయింది. ఇంకా ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేస్తే అప్పుడు ఇక ఈ మూడు ముక్కలాట ముగించక తప్పదు.