YSRCP_MP_Raghu_Rama_Krishna_Rajuసంక్షేమ పధకాల కోసం వైసీపీ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికీ దారులు మూసుకుపోతుండటంతో మరో సరికొత్త దారి కనుగొందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వచ్చిన పన్నును ప్రభుత్వ ఖజానాకు జమా చేయవలసి ఉండగా, జగన్ ప్రభుత్వం దానిని మార్జిన్ మనీ పేరుతో ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్‌కు బదలాయిస్తోందని ఆరోపించారు.

ఆ మొత్తాన్ని బెవరెజెస్ సంస్థ ఆదాయంగా చూపిస్తూ, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొంటోందని ఆరోపించారు. దీని కోసం ఏపీ ప్రభుత్వం ఏపీ మద్యం యాక్ట్ 31,2021ని యాక్ట్ 9/2022గా సవరణ చేసిందని దానిని రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణ రాజు ఏపీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇటువంటి అడ్డుగోలు విదానంతో ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు రుణసేకరణ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు నిర్దేశించిన రుణపరిమితికి మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఇది చాలా ప్రమాదకరమని కనుక దీనిని అడ్డుకోవలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్ డీవిఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ద్విసభ్య హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. న్యాయస్థానాలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక విధానాలు, వ్యవహారాలలో కలుగజేసుకోలేవని, ఒకవేళ కలుగజేసుకోవడం మొదలుపెడితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ సైతం ఏవిదంగా ఉండాలో నిర్దేశించవలసిన వచ్చినా ఆశ్చర్యం లేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక వ్యవహారాలను పరిశీలించేందుకు కాగ్, ఆర్‌బీఐ వంటి సంస్థలు ఉన్నాయని, ఒకవేళ ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అడ్డదారిలో అప్పులు చేస్తున్నట్లయితే ఆ సంస్థలు చూసుకొంటాయని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కనుక ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకొనేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

హైకోర్టు నిర్ణయంపై రఘురామకృష్ణ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రస్తుత ఆదాయంగా చూపిస్తూ ఆర్ధిక సంస్థలను తప్పుదోవ పట్టించి విచ్చలవిడిగా ఎప్పులు చేస్తుంటే, తాను ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఇటువంటి తప్పు కొనసాగకుండా చూడాలని కోరితే హైకోర్టు ధర్మాసనం దీనిలో ప్రజాహితం ఏముందని ప్రశ్నించడం చాలా బాధాకరమని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్‌, తన పార్టీ భవిష్యత్‌ మాత్రమే చూసుకొంటున్నారని, ఎన్నికలలో వైసీపీకి లబ్ది కలిగించేందుకు విచ్చలవిడిగా అప్పులు చేసి సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నారని కానీ వాటితో రాష్ట్రం భవిష్యత్‌ ఏమవుతుంది? ప్రజలపై భారం పడుతుందని మాత్రం ఆలోచించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసును హైకోర్టు ఎక్కువ రోజులు సాగదీయకుండా తన అభిప్రాయం త్వరగా తేల్చి చెప్పి చాలా మేలు చేసిందని, తాను వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామకృష్ణ రాజు చెప్పారు.