magunta-raghava-reddyఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదిలిన్నట్లు సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ వైసీపీ నేతలు ఒకరొకరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ కేసులో మొట్టమొదటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపటిలో సీబీఐ కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అరబిందో అధినేత శరత్ చంద్ర రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే ఓ సారి సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితని హైదరాబాద్‌లో ఆమె నివాసంలో ప్రశ్నించి ఆమె చెప్పిన వివరాలని నమోదు చేసుకొన్నారు.

నాలుగు రోజుల క్రితమే ఆమెకి గతంలో చార్టడ్ అకౌంటెంట్ సేవలు అందించి ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నగదు తరలింపులో పాల్గొన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని చారియట్‌ మీడియా సంస్థకి చెందిన రాజేష్ జోషి అనే వ్యక్తిని సీబీఐ రెండు రోజుల క్రితం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు దర్యాప్తు వేగం పుంజుకొందని స్పష్టం అవుతోంది.

ఈ లిక్కర్ స్కామ్‌తో తనకి, తన కుమారుడికి ఎటువంటి సంబందం లేదని, అసలు ఢిల్లీలో తమకి మద్యం వ్యాపారాలే లేవని, తమని అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం చెప్పారు. కానీ ఈ కేసులో ఆయన కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అవడంతో తర్వాత ఆయన వంతేనా?అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఓ భారీ కుంభకోణంలో వేలకోట్లు చేతులు మారాయి. ఇదీకాక ఈ కేసులో ఓ రాజకీయకోణం కూడా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వానికి, తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోంది. కనుక ఈ కేసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఓ బ్రహ్మాస్త్రంగా మారింది. దీనిని ఎప్పుడు ఎవరి మీద ప్రయోగిస్తుందో, ఈ కేసు విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరెవరు జైలుకి వెళతారో, ఈ కేసు నుంచి విముక్తి పొందడానికి ఎవరెవరూ ‘కాషాయ రక్షణ కవచాలు’ ధరిస్తారో రాబోయే రోజుల్లో అందరూ చూడవచ్చు.