Kanumuru Raghu Rama Krishna Rajuరెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్లమెంట్ లో మాతృభాషలో బోధన జరగాలంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ఈ ధిక్కారణ ఇప్పుడు అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి గట్టిగా స్పందించారని వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లీషు మీడియంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల జీవితాలు మారతాయని గట్టిగా విశ్వసిస్తున్నామని, అన్ని విధాలుగా చర్చించాకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని, అందుకు వ్యతిరేకంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘనే అని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా వెనకాడేది లేదని గట్టిగా చెప్పారు. రఘురామకృష్ణం రాజుతో మాట్లాడమని పశ్చిమ గోదావరి ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో ముఖ్యమంత్రి చెప్పారట. వివరణ తీసుకోమని ఆదేశించారట.

ఎంపీ పేరు లేకుండా ఈ వార్త సాక్షిలో కూడా రావడం విశేషం. అయితే రఘురామకృష్ణం రాజు కావాలనే వివాదాలు సృష్టించి పార్టీ చేత సస్పెండ్ చెయ్యబడాలని చూస్తున్నారని పలువురి అభిప్రాయం. బ్యాంక్ రుణాల ఎగవేత కేసుల నుండి ఊరట పొందడానికి రఘురామకృష్ణం రాజు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీతో సఖ్యతతో ఉండటంతో ఆయనకు ఓ పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి కూడా వచ్చింది.