YS-Jagan-MP-Gorantla-Madhavఒకప్పుడు సీఐగా చేసిన గోరంట్ల మాధవ్‌ను టచ్ చేస్తే వైసీపీకి షాక్ తగిలే ప్రమాదం కనిపిస్తోంది. గోరంట్ల నగ్న వీడియోపై రాష్ట్రంలో పెద్ద దుమారం చెలరేగుతున్నా ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన కూడా మరో బల్లెంలా మరి జగన్ ప్రభుత్వంతో చెడుగుడు ఆడటం మొదలుపెట్టవచ్చు. పైగా తన వీడియో లీక్ కాగానే అతను బీసీ కార్డు బయటకు తీసి ప్రయోగించారు. అంటే ఒకవేళ ఈ వ్యవహారంలో తనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్లయితే జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రచారం మొదలుపెట్టే ఆచనలో ఉన్నట్లు అర్దమవుతోంది.

ఒకవేళ అతను స్వయంగా రాజీనామా చేసినా, వైసీపీ అతని చేత బలవంతంగా రాజీనామా చేయించినా మళ్ళీ ఉపఎన్నికలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఆ నియోజకవర్గంలో సానుభూతి ఓట్లు పొందవచ్చు కానీ రసికరాజు శృంగార చేష్టల వలన ఉపఎన్నిక జరిగితే అతనిపై అసహ్యంతో ప్రజలు తప్పకుండా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. అదే కనుక జరిగితే ఆ సీటు టిడిపికి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

అందుకే ‘ఇది ప్రైవేట్ వ్యవహారమని…’ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందే ఓ మాట అనేసి, దీంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదన్నట్లు మాట్లాడారు. ఒకవేళ దర్యాప్తులో అది మార్ఫింగ్ వీడియో కాదని తేలితే చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఈ వేడి చల్లారే వరకు దర్యాప్తును కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు.

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో ఇప్పుడు ప్రతిపక్షాలు చల్లబడిపోయినట్లే, గోరంట్ల మాధవ్‌ విషయంలోనూ చల్లబడతాయి. ఒకవేళ అప్పటికీ ఇంకా ఈ వేడి కొనసాగితే ఫోరెన్‌సిక్‌ నివేదిక చేతికి వచ్చాక ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చునని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుండటం సహజమే. కనుక రసికరాజు గోరంట్ల మాధవ్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే కష్టం, నష్టం ఏమీ లేవనే భావించవచ్చు.