YSRCP MP call to disqualify rebel MP raghu ramakrishna rajuవచ్చే పార్లమెంట్ సమావేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ సారి తమ డిమాండ్ నెరవేరకపోతే సభను స్తంభింప చేస్తామని… ఎట్టిపరిస్థితులలోను సభా కార్యక్రమాలు జరగనివ్వబోమని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు.

ఇదంతా విన్నాకా ప్రత్యేక హోదానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ హక్కులనో వైఎస్సార్ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది అనుకుంటే పొరపాటే… విజయసాయి రెడ్డి గారు చెప్పేది వేరు. ఆయన తమ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అనర్హత పిటిషన్ గురించి పట్టుబడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ ని అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీలు మరోమారు స్పీకర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. శరద్‌యాదవ్‌పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదు. కానీ.. రఘురామకృష్ణరాజు విషయంలో ఏడాది నుంచి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు అంటూ విమర్శించారు ఆయన.

రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేస్తే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని లోక్ సభ స్పీకర్‌కు స్పష్టం చేశాం అంటూ మీడియాకు చెప్పుకొచ్చారు ఆయన. ఇదే జరిగితే అధికారంలోకి వచ్చాకా మొట్టమొదటి సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంట్ ను స్తంభింప చేస్తున్నట్టు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసం చేస్తుండడం విచారకరం.