YSRCP moves No Confidence Motion on speakerఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ పనితీరు సరిగా లేనపుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, సంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా రాజకీయాలు చేసే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ‘అవిశ్వాసం’ అనే దాన్ని తమ సొంత పార్టీ సభ్యులను ఇరుకున పెట్టడానికి మాత్రమే వినియోగిస్తానని అసెంబ్లీ వేదికగా దీనిని ఒప్పుకున్నారు. అయితే ‘ఇధం’ చెడినా ‘ఫలితం’ దక్కాలి కదా… జగన్ దానికి కూడా నోచుకోలేకపోయారు. జగన్ పెట్టిన అవిశ్వాసానికి ప్రభుత్వం ఇరుకున పడలేదు, అలాగని పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అవమానకరమైన రీతిలో వైసీపీ మిగిలిపోయింది.

అది చాలదన్నట్లు మరోసారి ‘అవిశ్వాసం’ అంటూ ముందుకొచ్చారు జగన్. అయితే ఈ సారి టార్గెట్ స్పీకర్ కోడెల శివప్రసాద్ పైన. మరి ఈ అవిశ్వాసం ఎవరిని ఇరుకున పెట్టడానికి ఇచ్చారో గాని, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు సంతకం చేసిన అవిశ్వాసం నోటీసును అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అందజేసారు. దీంతో మరోసారి జగన్ నవ్వులపాలు కావడానికే అవిశ్వాసం ఇచ్చారన్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి. ఈ సారి కూడా తన పార్టీ నుండి టిడిపిలోకి వెళ్ళిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికే అవిశ్వాసం ఇచ్చి ఉంటారన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.