YSRCP MLA Vundavall Sridevi fires on TDPఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఎదురుదాడి చెయ్యడమే మేలు అని నిర్ణయించుకున్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం… వైఎస్సార్ కాంగ్రెస్. ఒక టెలివిజన్ డిబేట్ లో జరిగిన ఉదంతం ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ని ఒక ఆర్డినెన్సు తెచ్చి మరీ తప్పించింది ప్రభుత్వం.

దీనిపై అన్ని పార్టీల వారినీ పిలిచి చర్చ పెట్టింది ఆ ఛానల్. అదే సమయంలో కాలర్స్ తో కూడా మాట్లాడించింది. ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పాల్గొన్నతాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని “మీకు నచ్చలేదని ఆర్డినెన్సు తెచ్చి ఎన్నికల అధికారిని తప్పించారు కదా? అదే విధంగా ప్రజలకు తమకు నచ్చని ఎమ్మెల్యేలు, ఎంపీలను తప్పించడానికి కూడా ఏదైనా ఆర్డినెన్సు తెచ్చే ఉద్దేశం ఉందా?,” అని ప్రశ్నించారు.

“అదేనా మీ క్వశ్చన్ ఇంకేదైనా? అదొక్కటేనా ఇంక రాజధాని గురించి ఏమైనా మాట్లాడతారా? మీరు తెలుగుదేశం ముసుగు వేసుకున్న తెలుగుదేశం కార్యకర్త మీరు. మీది ఏ ఊరు? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు,” అంటూ విరుచుకుపడ్డారు.

సదరు కాలర్ నేను ఒక ఓటర్ గా అడుగుతున్నా అంటున్నా ఆ ఎమ్మెల్యేగారు పట్టించుకోలేదు. “నిమ్మగడ్డ రమేష్ గారు 2018లో ఎన్నికలే నిర్వహించలేదు. ఇప్పుడు మొదలుపెట్టి ఐదు రోజులు ఉంది అనగా ముఖ్యమంత్రిగారితో చర్చించకుండా ఆపేశారు. ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఎస్పీలను, కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?,” అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు