Talari Venkata Rao attackedఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ ఈరోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న గోపాలాపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఉదయం జి.కొత్తపల్లికి వెళ్లినప్పుడు, ప్రసాద్ కుటుంబ సభ్యులు గంజి ప్రసాద్ అనుచరులు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. వారి నుంచి ఎమ్మెల్యేను కాపాడి సురక్షితంగా వెనక్కు తీసుకుపోయెందుకు పోలీసులు చాలా శ్రమించవలసి వచ్చింది. ఈ తోపులాటలో పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు.

ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గంజి ప్రసాద్‌ మద్య రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతుండేవని తెలుస్తోంది. కనుక ఆ విషయంలో వారు ఏమైనా గొడవ పడుతున్నారా లేక మరెదైనా కారణమా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఏమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయంలో పార్టీ నేతే హత్యకు గురికావడం, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్తే వైసీపీ కార్యకర్తలే ఆయనపై దాడి చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ హత్య, ఎమ్మెల్యేపై దాడిపై సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై తక్షణం లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో వరుసగా హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటంతో, టిడిపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వాన్ని, పోలీసులను గట్టిగా నిలదీస్తున్నప్పుడే వైసీపీ నేత హత్య, వైసీపీ ఎమ్మెల్యేపై పార్టీ కార్యకర్తలే దాడి చేయడంతో ఈ రెండు ఘటనలపై టిడిపి ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.