YSRCP-MLA-MS-Babuచిత్తూరు జిల్లా పూతపట్టు పరిధిలోని వేపనపల్లిలో గురువారం గడప గడపకి కార్యక్రమంలో అనూహ్య సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గ్రామంలో పర్యటిస్తుండగా ఇంజనీరింగ్ విద్యార్ధి జశ్వంత్ తనకు మూడో విడత విద్యా దీవెన డబ్బులు అందలేదని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశాడు. త్వరలో వస్తాయని ఎమ్మెల్యే సర్దిచెప్పి ముందుకు వెళ్ళబోతుంటే, “ఈ మూడేళ్ళలో మీరు ఈ గ్రామానికి చేసిందేమిటి?గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మూడేళ్ళ క్రితం ఎలా ఉందో నేటికీ అలాగే ఉంది…” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఎమ్మెల్యే పక్కనే ఉన్న పోలీసులు ఆ విద్యార్ధిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించబోయారు. అప్పుడు గ్రామస్తులు తమ వాహనాలు అడ్డుపెట్టి పోలీస్ జీప్ ముందుకు కదలకుండా అడ్డుకొన్నారు.

అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. వారి మద్య ఘర్షణ జరుగుతుండగా పోలీసులు జశ్వంత్‌ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత మరికొంత మంది గ్రామస్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలుసుకొన్న చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధ్యక్షుడు పులివర్తి నాని, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌ ఎదుట బైటాయించి ధర్నా చేశారు. వేపనపల్లి మహిళలు జాతీయ రహదారిపై బైటాయించి నిరసనలు తెలిపారు. జశ్వంత్‌తో సహా అరెస్ట్ చేసిన గ్రామస్తులందరినీ తక్షణం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గడప గడపకి కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందనవస్తోందని, పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం జరుగుతోందని జగన్ ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని ఈ ఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలని పధకాలు పొందిన లబ్దిదారులు కూడా నిలదీస్తున్నారని స్పష్టమవుతోంది. వైసీపీ నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం మాట దేవుడెరుగు.. తమ గురించి, తమ ప్రభుత్వం గురించి ఏమనుకొంటున్నారో కళ్ళారా చూడగలుగుతున్నారు. బహుశః ఈ విషయం తెలియకానే సిఎం జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు గెలుచుకొంటామని చెపుతున్నారేమో?