YSRCP MLA Mohammad Musthafa Shaik కరోనావైరస్‌ సోకిందన్న అనుమానంతో గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన ఎమ్మెల్యే బావమరిదికి, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యేకు కూడా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఐసోలేషన్‌కి తరలించారు.

గుంటూరు సమీపంలోని ఓ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒకటి రెండు రోజులలో పరీక్షల ఫలితాలు వస్తాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే సదరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వాయిదా పడగానే రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విరుచుకుపడ్డారు.

అసలు కరోనా అనేది పెద్ద సమస్యే కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కనుసన్నలలో రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారని చెప్పారు. ఇప్పుడు ఆయనకే ఐసొలేషన్ తప్పలేదు. ఇదే కదా దేవుడి స్క్రిప్ట్ అంటే అని తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 13 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లేకపోవడం, పెద్ద కంపెనీలు కూడా లేకపోవడంతో ఇతర దేశాల నుండి వచ్చే వారు తక్కువే. దీనితో రాష్ట్రం ఈ వైరస్ తాకిడి కొంత తక్కువే ఉందని చెప్పుకోవాలి.