YSRCP_MLA_Ministers_Skip_Jagan Review Meetingసోమవారం తాడేపల్లిలో సిఎం జగన్‌ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలతో సహా మరికొందరు మొహం చాటేసిన్నట్లు తెలుస్తోంది. వారిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, హోమ్ మంత్రి విడదల రజని, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని తదితరులున్నారు. దాదాపు 10 మంది ఈ కీలక సమావేశానికి హాజరుకాన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న ఈ సమావేశం చాలా కీలకమని తెలిసి ఉన్నప్పటికీ ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మొహం చాటేయడం ద్వారా తమ అసంతృప్తిని తెలియజేసిన్నట్లే అని భావించవచ్చు. వారిలో మంత్రి బుగ్గన తనకు కరోనా సోకడం వలన సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని ముందే తెలియజేసిన్నట్లు సమాచారం. కానీ మిగిలినవారు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ నాలుగు స్థానాలలో వైసీపీ ఓడిపోవడంతో సిఎం జగన్‌ ఆగ్రహంగా ఉంటారని, అది తమపై ప్రదర్శిస్తారనే భయం వల్ల కూడా కొందరు డుమ్మా కొట్టి ఉండవచ్చు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొదట్లో హుషారుగా మీడియా ముందుకు వచ్చి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేవారు. కోర్టులలో కేసులు వేస్తూ హడావుడి చేస్తుండేవారు. కానీ రాజధాని విషయంలో అధినేత తీరుతో నియోజకవర్గంలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండటంతో ఆయన సైలెంట్ అయిపోయారు. బహుశః అదే కారణంగా నేడు సమావేశానికి డుమ్మా కొట్టారేమో?

సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రాస్ కార్డు చదివి వినిపించి, గడప గడపకి వెళ్ళనివారికి మళ్ళీ చివాట్లు పెట్టి, టికెట్స్ ఇవ్వనని హెచ్చరిస్తారనే కారణంతో కొందరు డుమ్మా కొట్టి ఉండవచ్చు.

ఈ సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణపై మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే అని కొట్టిపాడేశారు. ఎప్పటిలాగే తన ప్రభుత్వం, పాలన గొప్పదనం, దాంతో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొన్నాక వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నిత్యం ప్రజల మద్యనే ఉండాలని మరోసారి హెచ్చరించారు. అందరూ పని తీరు మెరుగుపరుచుకొని గ్రాఫ్ పెంచుకోవాలని మరోసారి హెచ్చరించారు.

మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఏవీ లేవని, ఏ ఒక్క ఎమ్మెల్యేని వదులుకోవాడాకి ఇష్టపడనని సిఎం జగన్‌ చెప్పినప్పటికీ ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు కీలకసమావేశానికి డుమ్మా కొట్టడం తేలికగా కొట్టిపడేయలేము కదా?