Malladi-Vishnuవిజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా మంత్రికి, నేతలకి పెద్ద తలనొప్పిగా మారారు. ఇది వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి చెందిన వైన్ షాపులో కల్తీ మద్యం త్రాగి 9 మంది అక్కడే నురగలు కక్కుకొంటూ చనిపోయినప్పుడు మల్లాది విష్ణు నెలరోజుల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ‘వైసీపీ రక్షణ కవచం’ ధరించిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆ కేసు ఏమయిందో? ఎవరికీ తెలీదు.

కానీ మల్లాది విష్ణు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. ఏ స్థాయిలో అంటే, ఆయన ధాటికి మంత్రి ఆదిమూలపు సురేష్, నగర మేయర్ రాయణ భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, డెప్యూటీ మేయర్, ఎమ్మెల్సీ రుహూల్లా, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు అందరూ కూడా మల్లాది విష్ణు పేరు చెపితేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే, ఆయన ఎవరినైనా టార్గెట్ చేసుకొన్నారంటే వారు అంతుచూడనిదే వదిలిపెట్టరు.

ఏపీ ఫైబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ఉనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేస్తే మల్లాది విష్ణు చక్రం తిప్పి ఆమెను ఓడగొట్టారు. అని గౌతమ్ రెడ్డి వర్గీయులే ఆరోపిస్తుంటారు. ఇక మేయర్ భాగ్యలక్ష్మిని మల్లాది విష్ణు చేతిలో ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యి బాధపడుతుంటారు. తన నియోజకవర్గంలో ఆమె ఏదైనా అధికారిక కార్యక్రమానికి వస్తున్నారని తెలిస్తే మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి ముందుగా అక్కడకు చేరుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించేస్తుంటారు. దాంతో ఆమె అవమానకర పరిస్థితులలో వెనుతిరిగిన సందర్భాలు కోకొల్లలున్నాయి.

రెండు నెలల క్రితం హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేయర్ భాగ్యలక్ష్మి వచ్చినప్పుడు మల్లాది విష్ణు అనుచరులు ఆమెను వేదికపైకి రాకుండా అడ్డుకొన్నారు. అయినప్పటికీ ఆమె వేదికపైకి వెళ్ళేందుకు ప్రయత్నించగా పక్కకి తోసేయడంతో ఆమె కింద పడిపోయారు. ఈ అవమానం భరించలేక ఆమె కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నియోజకవర్గంలో జరిగే అధికార కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్సీ రుహుల్‌ని తప్పనిసరిగా ఆహ్వానించాల్సి ఉండగా మల్లాది విష్ణు ఏనాడూ ఆహ్వానించలేదు. కనీసం ఫ్లెక్సీ బ్యానర్ల మీద ఆయన ఫోటో కూడా ముద్రించనేచ్చేవారు కాదు.

మల్లాది విష్ణు అనుమతి లేకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అడుగుపెట్టాలంటే భయపడిపోతుంటారు. కల్తీ మద్యం కేసు నుంచి బయటపడేందుకు వైసీపీలో చేరిన మల్లాది విష్ణు ఇప్పుడు ఏకు మేకైపోయారని జిల్లాలోని వైసీపీ నేతలు గుసగుసలాడుకొంటున్నారు.