Kotamreddy-Sridhar-Reddy-Phone-Tapping-Intelligence-Spyసాధారణంగా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం తమ ఫోన్లని ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తుంటారు. కానీ ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తన ఫోన్‌ని కూడా ట్యాపింగ్ చేయిస్తోందని బహిరంగంగా ఆరోపించారు. ఆయన శనివారం నెల్లూరులో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నప్పుడు, ఆయనకి ఇంటలిజన్స్ సిబ్బంది కనబడ్డారు.

దాంతో ఆయన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “మీరు ఎలాగూ మూడు నెలలుగా నా ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారు కదా?ఇంకా నా మీద నిఘా కూడా పెడుతున్నారా?మూడు నెలలుగా మీరు నా ఫోన్లన్నిటినీ ట్యాపింగ్ చేస్తున్నారని నాకు తెలుసు. కనుక మీరు నా నుండి ఏం వినాలనుకొంటున్నారో నేను అదే ఫోన్లో మాట్లాడుతున్నాను. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేనైన నా ఫోన్లనే మీరు ట్యాపింగ్ చేయడం, నా మీద నిఘా పెట్టడం నాకు చాలా అవమానంగా ఉంది,” అని మీడియా ముందు అనేసరికి అందరూ షాక్ అయ్యారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదివరకు తన నియోజకవర్గంలో కాలువ పనులు మున్సిపల్ అధికారులు ఎంతకీ పూర్తిచేయకపోవడంతో మురికి కాలువలో నిలబడి నిరసన తెలియజేశారు. ఇటీవల తన నియోజకవర్గంలో వృద్ధులు, వికలాంగులకి పింఛనులు తొలగిస్తోందని ప్రభుత్వంపై బహిరంగగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వైసీపీలో ఉంటూ ప్రభుత్వం మీద తరచూ అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నందునే బహుశః ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టిందేమో? అయితే ఇది ఆయన ఒక్కరికే పరిమితమ వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి మీద నిఘా ఉందా?వైసీపీ అధినేతకి సొంత పార్టీ ప్రజాప్రతినిధులపైనే నమ్మకం లేకపోతే రాబోయే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు ఎలా గెలుస్తుందో?