Gudivada-Amarnathవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరిగింది అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పడంతో ఏపీలోని అధికార పక్షం ఇరుకునపడింది. మరోవైపు… స్టీల్ ప్లాంట్ పోరాటం విషయంలో టీడీపీ ముందుంది. ఇప్పుడు దానిని నుండి తప్పించుకుని తెలుగుదేశం మెడకు చుట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్.

“2018లో సౌత్‌ కొరియా వెళ్లి పోస్కో సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్నది నిజం కాదా? విశాఖ స్టీల్‌ పరిశ్రమ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దాన్ని అమ్మేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదనే కనీస జ్ఞానం లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారు,” అని ఆ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ చెప్పుకొచ్చారు.

ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాసేపు పక్కనపెడితే… 2018లో చంద్రబాబు కొరియా వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని అన్నారు… అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దాన్ని అమ్మేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అని కూడా ఆయనే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేకపోతే… చంద్రబాబు ఒప్పందం ఎలా చేసుకుంటారు?

ఒకవేళ చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే… ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు సార్లు ఆ సంస్థ ప్రతినిధులు విశాఖ వస్తే ఏం చేసారు? సీఎంని కలిసినపుడు వారు ఎందుకు వచ్చారో తెలీదా? తెలిస్తే కేంద్రానికి అప్పుడే లేఖ రాసి ఎందుకు ఆపే ప్రయత్నం చెయ్యలేదు. చంద్రబాబు టైమ్ లో తప్పు జరిగితే దానిని సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుని లాజిక్ మిస్ అవుతున్నట్టు ఉన్నారు.