YSRCP_MLA_Anil_Kumar_Yadavవెనకటికి ఒకడు “వెయ్యెకరాల మాగాణి పోతే పోయింది కానీ ‘లా’ మొత్తం క్షుణ్ణంగా తెలిసింది,” అన్నాట్ట! అనిల్ కుమార్‌ యాదవ్ మాజీ మంత్రిగా మారిన తర్వాత ఆయన కూడా అలాగే “మంత్రి పదవిపోతే పోయింది కానీ నావాళ్ళెవరో… కానివాళ్ళెవరో చక్కగా ఇప్పుడు తెలిసొస్తోంది,” అని అంటున్నారు.

మంత్రి పదవి ఊడిన తర్వాత అనిల్ కుమార్‌ యాదవ్ సహచరులు ఒకరొకరిగా విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. వారిలో నెల్లూరు నగర మేయర్, పలువురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వారందరికీ తాను ఎంతో కొంత మేలే తప్ప ఏనాడూ అపకారం చేయలేదని అయినా అందరూ తనని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారో అని అనిల్ కుమార్‌ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈవిదంగా జరగడం కూడా ఒకందుకు మంచిదే అని దీని వలన కష్టకాలంలో తనని అంటిపెట్టుకొని ఉండేదెవరో… పదవిలో ఉన్నప్పుడు తన చుట్టూ మూగేదెవరో తెలుసుకోగలిగానని అన్నారు.

రాజకీయాలలో ఇటువంటి ఆటుపోట్లు, వెన్నుపోట్లు సహజమే కానీ తాను ఎంతో నమ్మి గౌరవించినవారే మంత్రి పదవిపోగానే తనని విడిచిపెట్టి వెళ్ళిపోతుండటం చూసి మనసుకి చాలా బాధకలుగుతోందని అన్నారు. ఈ చేదు అనుభవంతో మంచి గుణపాఠం నేర్చుకొన్నానని, ఎప్పుడూ ప్రజలనే నమ్ముకోవాలి తప్ప నాయకులని కాదని గ్రహించానని అన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్‌ కోసం, అలాగే బయట రాజకీయ ప్రత్యర్ధులతో కూడా తీవ్రమైన పోటీ ఉంటుందని, కనుక ప్రజలనే నమ్ముకొని ముందుకు సాగుతున్నానని మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ అన్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్‌ యాదవ్‌కి చాలా కీలకమైన సాగునీటి పారుదలశాఖ మంత్రిగా నియమించారు. సాధారణంగా పూర్వానుభవం లేనివారికి అటువంటి కీలకమైన శాఖని ఇవ్వడం జరగదు. కానీ కీలకమైన ఆ పదవిని దక్కించుకొన్న అనిల్ కుమార్‌ యాదవ్, తమ అధినేత మెప్పు కోసం పార్టీలో కొడాలి నాని వంటి సాటి మంత్రులతో పోటీ పడుతూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శిస్తుండేవారు. అయినా జగనన్న వారిద్దరికీ మంత్రి పదవులు ఊడగొట్టి బయటకి పంపించేశారు. ఇప్పుడు అనిల్ కుమార్‌ యాదవ్ స్థానంలో వచ్చిన మంత్రి అంబటి రాంబాబు కూడా తన శాఖని పట్టించుకోకుండా అలాగే చెలరేగిపోతున్నారు. కనుక లక్కీ డ్రాలో ఆయనకి టికెట్‌ వస్తుందో లేదో రాబోయే ఎన్నికలకి ముందు తెలుస్తుంది.