YSRCP MLA Anil Kumar Yadav in Assemblyఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమైన అంశమో, పోలవరం ప్రాజెక్ట్ కూడా అంతే ప్రాధాన్యతను దక్కించుకుంది. ఎన్నో దశాబ్దాలుగా పేపర్ మీదున్న ఈ ప్రాజెక్ట్ ను అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పట్టాలెక్కించింది. కానీ అర్ధాంతరంగా జరిగిన వైఎస్ మరణం తర్వాత ఈ ప్రాజెక్ట్ పనులు అటకెక్కేశాయి. ఆ తదుపరి జరిగిన రాష్ట్ర విభజనతో, పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ హోదా ఇవ్వాలని బిల్లులో తీర్మానించారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో త్వరితగతిన పనులను చేయించడంలో కొంతమేర విజయవంతం అయ్యింది. అయితే జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నిధులను వెచ్చించడంలో కేంద్రం చూపిన జాప్యత వలన ఆశించిన ఫలితం రాకపోయినా, రాష్ట్ర నిధులతో అయినా పోలవరంను పూర్తి చేయాలనే దృఢ సంకల్పాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేసారు.

2019లో జగన్ సర్కార్ వచ్చిన వెంటనే తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానంతో అప్పటివరకు సాగుతున్న పనులు ఆగిపోయిన వైనం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ జరిగిన తర్వాత ప్రాజెక్ట్ ను పూర్తి చేసే బాధ్యతను ‘మేఘా’ సంస్థ దక్కించుకున్న విషయం బహిరంగమే. అయితే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే సంకల్పంతో వైసీపీ లేదని అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

దీనిపై నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ… అసెంబ్లీ వేదికగా టిడిపి నేతలను ఎద్దేవా చేస్తూ అన్న మాటలను ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. నాడు అసెంబ్లీలో అనిల్ గారు చేసిన ఎటకారపు మాటలకు నేడు “ఒక్క అడుగు” దూరంలో ఉండడమే!

“ఏ పర్సెంట్ అయితే తొందరెందుకన్నా… ఎందుకు తొందరా… వెయిటూ… మేము ఆ రోజే చెప్పాం, డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం” అంటూ భీకర స్వరంతో ముగించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలుగుదేశం వర్గాలు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.

డిసెంబర్ మాసానికి ఇంకా ఒక్క రోజు దూరంలో ఉండగా, రేపటికల్లా పోలవరం పూర్తవుతుందా? ఇంకా ఏంటి సంగతులు? ఓపెనింగ్ కు ఎవరు వస్తున్నారు? అంటూ అనిల్ గారి వీడియోను షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్లు కూడా కాస్త ఎటకారాన్ని పండించడంలో నిమగ్నమయ్యారు. రోజులు అందరివీ ఒకలా ఉండవు కదా మరి! ఎవరికి అవకాశం వచ్చినపుడు వాళ్ళు పండించడమే!