MLA-Alla-Rama-Krishna-Reddy-Followers-Joined-TDPటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేతలు తరచూ చేసే విమర్శలలో గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారనేది కూడా ఒకటి. గత ఎన్నికలలో 5,372 ఓట్ల తేడాతో నారా లోకేష్‌ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం వీచినప్పుడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంత స్వల్ప తేడాతో గెలవగలిగారు. కానీ వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి ప్రభంజనాలు ఉండబోవని, వైసీపీ, టిడిపిల మద్య హోరాహోరీ పోరు అనివార్యమనే విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. నారా లోకేష్‌ తొలిసారిగా మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ పోయిన చోటే ఉంగరాన్ని వెతుక్కోవాలన్నట్లు, వచ్చే ఎన్నికలలో కూడా మంగలగిరి నుంచే పోటీ చేయాలని ఓడిపోయిన రోజునే నిర్ణయించుకొన్నారు. అప్పటి నుంచి మంగళగిరిలో పట్టు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

అమరావతిని రాజధానిగా చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గంలో రైతులు ఇప్పుడు ఎంతగా పశ్చాత్తాపపడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మంగళగిరికి చెందిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను జీర్ణించుకోవడం కష్టమే కానీ పైకి చెప్పుకోలేని పరిస్థితి. మొదట్లో టిడిపికి వ్యతిరేకంగా గట్టిగానే పోరాడినప్పటికీ ఆయన కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా ఇటీవల ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇప్పటం గ్రామంలో తమ ప్రభుత్వం ఇళ్ళు కూల్చివేయడాన్ని సమర్ధించుకోలేక వ్యతిరేకించలేక చాలా ఇబ్బంది పడ్డారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు, విద్వేషా నిర్ణయాల కారణంగా మంగళగిరి నియోజకవర్గం ప్రజలలో జగనన్న ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి కూడా బాగా తెలుసు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు.

నియోజకవర్గంలో మారిన పరిస్థితులను గమనిస్తున్న ఆయన ముఖ్య అనుచరుడు గొర్ల వేణు గోపాల్ రెడ్డి నిన్న వైసీపీకి రాజీనామా ఇచ్చేసి నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. కుంచనపల్లి వైసీపీలో సీనియర్ నేత అయిన వేణుగోపాల్ రెడ్డితో ఆయన అనుచరులు కూడా నిన్న టిడిపిలో చేరారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ, “గొర్ల వేణు గోపాల్ రెడ్డిని అనుచరులను సాధారంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వైసీపీలో నేతలందరూ ఆత్మగౌరవం చంపుకొని సిఎం జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అందరూ తాము జగన్ చేతిలో చిక్కుకుపోయి కీలుబొమ్మలా ఆడుతున్నామని గ్రహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జగన్ బాధితులే. కనుక వైసీపీలో జగన్ బాధితులందరూ బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. టిడిపిపై నమ్మకంతో పార్టీలో గొర్ల వేణు గోపాల్ రెడ్డికి సముచిత గౌరవం, స్థానం కల్పిస్తాము,” అని అన్నారు.