Vijaya Sai Reddy Vizagఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు విశాఖపట్నం చాలా కీలకమైనది. గతంలో జగన్ మాతృమూర్తి విజయమ్మను ఓడించిన చోట జగన్ ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించారు. రాజకీయంగా కూడా ఉత్తరాంధ్ర లో ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర లో పార్టీ ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్టు ఉంది.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు జిల్లాలో ప్రాధాన్యం లేదని, అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదని బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంఛార్జి విజయసాయి రెడ్డి దృష్టికి పలుసార్లు తీసుకునివెళ్ళినా ఉపయోగం లేదని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.

దీనితో ఇంఛార్జి బాధ్యతలను మార్చే ఆలోచన జగన్ చేసినట్టు తెలుస్తుంది. జగన్ బాబాయ్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కి ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించినున్నట్టు సమాచారం. ఇటీవలే విశాఖకు ఒక టీటీడీ కార్యక్రమానికి వచ్చిన సుబ్బారెడ్డి పలువురు నేతలను పిలిపించుకుని పార్టీ పరిస్థితి పై చర్చించిన్నట్టు సమాచారం.

అయితే జరుగుతున్న పరిణామాలు విజయసాయి రెడ్డికి మింగుడుపడటం లేదట. జగన్.. విజయసాయి రెడ్డిల బంధం అందరికీ తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. ఈ సారి ఏం జరగబోతుంది అనేది త్వరలో తెలుస్తుంది.